South African President Jacob Zuma
-
జాకబ్ జుమా రాజీనామా
జోహన్నెస్‌బర్గ్: దక్షిణాఫ్రికా అధ్యక్షుడు జాకబ్ జుమా ఎట్టకేలకు తన పదవికి రాజీనామా చేశారు. దీంతో అధికార ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ (ఏఎన్సీ), జుమాకు మధ్య ఏర్పడిన ప్రతిష్టంభనకు తెరపడింది. ఆయన రాజీనామా చేయకపోతే ప్రతిపక్ష పార్టీలతో కలసి పార్లమెంటులో అవిశ్వాస తీర్మానం పెట్టి జుమాను గద్దె దించాలని అధికార పార్టీ భావించడం తెల్సిందే. ఏఎన్సీ జాతీయ నాయకత్వం మూడు రోజుల పాటు జరిపిన చర్చల్లో జుమా రాజీనామా చేయాల్సిందిగా కోరింది. అందుకు ఆయన నిరాకరిస్తూ వచ్చారు. అనూహ్యంగా బుధవారం రాత్రి మీడియా సమావేశం ఏర్పాటు చేసి తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు జుమా ప్రకటించారు. దీంతో 9 ఏళ్ల జుమా పాలనకు తెరపడింది. దాదాపు 30 నిమిషాల పాటు ఆయన ప్రసంగించారు. కాగా, బుధవారం ఓ టీవీ చానల్లో ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. అసలు తాను రాజీనామా చేసేందుకు పార్టీ నాయకత్వం ఎలాంటి కారణాలను తనకు చూపలేదని చెప్పారు. అధ్యక్ష స్థానంలో సిరిల్ రామాఫోసాను కూర్చోబెట్టాలని ఏఎన్సీ తీసుకున్న నిర్ణయాన్ని ఆయన వ్యతిరేకించారు. జాకబ్ జుమా రాజీనామా నేపథ్యంలో దక్షిణాఫ్రికా నూతన అధ్యక్షుడిగా ప్రస్తుత ఉపాధ్యక్షుడు సిరిల్ రామాఫోసా ఏకగ్రీవంగా ఎన్నిక య్యారు. గురువారం జరిగిన పార్లమెంటు సమావేశంలో ఆయన ఎన్నికైనట్లు ప్రకటన వెలువడింది. ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా 65 ఏళ్ల రామాఫోసా రెండు నెలల కిందటే ఎన్నికయ్యారు. -
గాంధీ, నెహ్రూ, ఇందిర గ్రేట్..!
సదస్సులో ఆఫ్రికా నేతల ప్రశంసలు న్యూఢిల్లీ: ఇండియా- ఆఫ్రికా ఫోరం సదస్సులో పలువురు ఆఫ్రికా అగ్ర దేశాల అధినేతలు జాతిపిత మహాత్మాగాంధీ, మాజీ ప్రధానులు జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీలపై ప్రశంసల వర్షం కురిపించడం విశేషం. భారత్- ఆఫ్రికాల మధ్య సత్సంబంధాలకు ఆ ముగ్గురు నేతలు చేసిన కృషిని, ఆఫ్రికా, ఇండియాల మధ్య చరిత్రాత్మక సంబంధాలను తమ ప్రసంగాల్లో వారు గుర్తు చేశారు. ‘దాదాపు శతాబ్ద కాలంగా ఆఫ్రికా, భారత్‌లను ఐక్యంగా ఉంచుతున్న బంధాలను, ఆ విషయంలో ఇద్దరు దార్శనిక ప్రధానులైన జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీలు చూపిన చొరవను ఈ సందర్భంగా గుర్తుచేసుకోవడం అవసరం’ అని దక్షిణాఫ్రికా అధ్యక్షుడు జాకబ్ జుమా పేర్కొన్నారు. 1955లో జరిగిన ప్రఖ్యాత బాండుంగ్ సదస్సులో, అనంతరం అలీనోద్యమంలో నెహ్రూ పోషించిన పాత్రను జుమా గొప్పగా ప్రశంసించారు. ఆఫ్రికా - ఇండియా డెవలప్మెంట్ కోఆపరేషన్ ఏర్పాటులో, ఆఫ్రికా దేశాల స్వాతంత్య్రోద్యమాల్లో ఇందిరాగాంధీ అందించిన సహకారం మరవలేనిదన్నారు. అహింసా విధానంలో వలసపాలనకు అంతం పలికే ఉద్యమానికి గాంధీ, నెహ్రూలు నేతృత్వం వహించారని జింబాబ్వే అధ్యక్షుడు రాబర్ట్ ముగాబే పేర్కొన్నారు. భారత జాతీయ కాంగ్రెస్‌ను గొప్ప పార్టీగా ముగాబే అభివర్ణించారు. ఆఫ్రికాలో వలస పాలనకు వ్యతిరేకంగా నెహ్రూ, తన తాత కలిసి పనిచేశారని మొరాకో రాజు మొహమ్మద్6 గుర్తు చేశారు.