ఇక సార్వత్రిక సమరం
విజయనగరం కంటోన్మెంట్, న్యూస్‌లైన్: వరుస ఎన్నికల పరంపరలో భాగంగా తుది ఎన్నికలకు నేడు తెరలేవనుంది. మున్సిపల్, ప్రాదేశిక ఎన్నికల పోలింగ్ ముగియడంతో ఇక పార్టీలన్నీ సార్వత్రిక ఎన్నికలపై దృష్టిసారించాయి. ఈ మేరకు తుది యుద్ధానికి సన్నద్ధమవుతున్నా యి. పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ శనివారం విడుదల కానుంది.
జిల్లాలోని తొమ్మిది అసెంబ్లీ, ఒక పార్లమెంటు స్థానానికి సంబంధించి కలెక్టర్ కాంతిలాల్ దండే ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. మే 7న జరిగే ఎన్నికలకు సంబంధించి విడుదల కానున్న నోటిఫికేషన్లో అభ్యర్థులకు కావలసిన సమాచారంతో పాటు, వారు అనుసరించాల్సిన నియమ నిబంధనలు పొందుపరుస్తూ ఎన్నికల కమిషన్ పుస్తకాలను పంపిణీ చేసింది.
జిల్లాలోని తమ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులు అఫిడవిట్లను దాఖలు చేసేందుకు నామినేషన్ల స్వీకరణ చివరి రోజున కూడా అందజేసేందుకు అవకాశం కల్పించింది. ఆ రోజు ఆన్లైన్లో మాత్రమే పొందుపరచాలి. ఎన్నికల సమాచారం కోసం కలెక్టరేట్లో 1070 టోల్‌ఫ్రీ నంబరును ఏర్పాటు చేశారు. జిల్లాలో 16,86,020 మంది ఓటర్లు ఉండగా, వీరిలో పురుషులు 8,31,743 మంది, మహిళలు 8,54,170 మంది, ఇతరులు 107 మంది ఉన్నారు.
ఐదు రోజులు మాత్రమే నామినేషన్ల స్వీకరణ
ప్రతి రోజూ ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకూ మాత్రమే నామినేషన్లు స్వీకరిస్తారు. ఈ ఎన్నికల్లో నామినేషన్లు వేసేందుకు కాల పరిధి తగ్గింది. నామినేషన్లకు ఎనిమిది రోజుల సమయం ఉన్నట్టుగా నోటిఫికేషన్ విడుదల చేస్తున్నప్పటికీ కేవలం ఐదు రోజులు మాత్రమే నామినేషన్లు వేసేందుకు అవకాశం ఉంది. 13,14,18 తేదీల్లో ప్రభుత్వ సెలవు దినాలు కావడంతో ఆ రోజుల్లో నామినేషన్లు స్వీకరించబోమని కలెక్టర్ ప్రకటించారు. నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు ఏప్రిల్ 23. మే 16న ఓట్ల లెక్కింపు నిర్వహిస్తారు. ఎంపీ నియోజకవర్గానికి కలెక్టర్ రిటర్నింగ్ ఆఫీసర్‌గా వ్యవహరిస్తారు. ఎమ్మెల్యే అభ్యర్థులు తమ నియోజకవర్గ కేంద్రాలలో గల తహశీల్దార్ కార్యాలయాల్లో రిటర్నింగ్ అధికారులకు నామినేషన్లు సమర్పించాలి.
ఎంపీ అభ్యర్థి డిపాజిట్ రూ.25 వేలు, ఎమ్మెల్యే రూ.10 వేలు
కలెక్టరేట్లో ఎంపీ అభ్యర్థులు నామినేషన్లు వేయాల్సి ఉంటుంది. ఎంపీ అభ్యర్థి డిపాజిట్‌గా రూ.25 వేల ధరావత్తు చెల్లించాల్సి ఉంది. ఎస్సీ, ఎస్టీలకు రూ.12,500 ధరావత్తుగా నిర్ణయించారు. ఎమ్మెల్యే అభ్యర్థికి రూ.10 వేలు డిపాజిట్ కాగా, అందులో సగం ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు చెల్లించాల్సి ఉంది. ఎంపీ అభ్యర్థి వ్యయపరిమితి రూ.70 లక్షలు కాగా, ఎమ్మెల్యే అభ్యర్థి రూ.28 లక్షల వరకూ ఖర్చు చేయవచ్చు. ఎంపీ అభ్యర్థి ఫారం -2(ఎ), ఎమ్మెల్యే అభ్యర్థి ఫారం-2(బి)ను సమర్పించాలి.
అభ్యర్థులు తమ పిల్లల పేరున ఉన్న ఆస్తులను కూడా వెల్లడించాల్సి ఉంటుంది. అఫిడవిట్‌లోని ప్రతి కాలమ్‌నూ తప్పని సరిగా పూరించాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు కుల ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించాలి. మే 5వ తేదీ సాయంత్రం ఐదు గంటలలోగా ప్రచారాన్ని ముగించాల్సి ఉంది. అభ్యర్థులు తమ వ్యయ రిజిస్టర్లను ఆర్వోలకు కనీసం మూడుసార్లు చూపించాలి. సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఈ నెల 24,25 నుంచి నెలాఖరు వరకూ ఓటర్లకు స్లిప్పులు పంపిణీ చేస్తారు.
ఓటరు గుర్తింపునకు 21 రకాల గుర్తింపు కార్డులు
ఎన్నికల సంఘం ఈ సారి ఓటరు గుర్తింపునకు 21 రకాల ఐడెంటిటీలను ఆమోదించనుంది. తమ పరిధిలోని ఏవేని ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రైవేటు సంస్థలు ఇచ్చిన గుర్తింపు కార్డులు సైతం తీసుకుని పోలింగ్ బూత్‌కు వెళ్లే అవకాశాన్ని కల్పించింది.
మావోయిస్టు ప్రాబల్యం ఉన్న పార్వతీపురం, కురుపాం, సాలూరు నియోజకవర్గాల్లో ఉదయం ఏడు నుంచి సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్ నిర్వహిస్తారు. మిగతా అన్ని నియోజకవర్గాల్లో సాయంత్రం 6 గంటల వరకూ ఉంటుంది. ఓటర్లకు అవగాహన కల్పించేందుకు ఈనెల 17 నుంచి అవగాహన సదస్సులు నిర్వహిస్తారు.