వికలాంగులకు ప్రత్యేక కార్డులు
ఆధార్ తరహాలో ప్రత్యేక గుర్తింపు సంఖ్యను ఇవ్వాలన్న కేంద్రం
⇒ ఈ మేరకు చర్యలు చేపట్టాలని రాష్ట్రాలకు ఆదేశం
⇒ రాష్ట్రంలో ఇప్పటికే సదరం ద్వారా వికలత్వ నిర్ధారణ సర్టిఫికెట్లు జారీ
⇒ వీటిని ప్రామాణికంగా తీసుకోవాలంటున్న వికలాంగుల సంక్షేమ శాఖ
సాక్షి, హైదరాబాద్: ప్రతి దివ్యాంగుడికి విశిష్ట వికలత్వ గుర్తింపు(యూడీఐడీ) కార్డును ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం ప్రతి పౌరుడికి ఆధార్ కార్డు ఇస్తున్నట్లుగా.. వికలాంగులకు కూడా ప్రత్యేకంగా యూడీఐడీ ఇచ్చేలా కార్యాచరణ మొదలు పెట్టింది.
ఇందులో భాగంగా రాష్ట్రాల వారీగా చర్యలు చేపట్టాలని కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ ఆదేశించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాల్లో ఆధార్ కార్డుకు అత్యధిక ప్రాధాన్యం ఉంది. ఆధార్ అనుసంధానంతో అమలు చేస్తున్న పథకాల్లో పారదర్శకతతో పాటు సులభతరం కావడంతో వికలాంగులకు ఇదే తరహాలో ప్రత్యేక గుర్తింపు కార్డులు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో వికలాంగుల కోటా భర్తీ ప్రక్రియకు ఈ కార్డులు కీలకం కానున్నాయి. అంతేకాకుండా వికలాంగులకు ఇచ్చే యూడీఐడీ కార్డులు దేశవ్యాప్తంగా చెల్లుబాటు కానున్నాయి.
రాష్ట్రంలో 10.5 లక్షల మంది..
రాష్ట్రవ్యాప్తంగా 10.5 లక్షల మంది దివ్యాంగులున్నట్లు అధికార గణాంకాలు చెబుతున్నాయి. వీరిలో రాష్ట్ర ప్రభుత్వం ఆసరా పేరిట అమలు చేస్తున్న సామాజిక భద్రత పథకం కింద 6.46 లక్షల మంది లబ్ధి పొందుతున్నారు. వీరికి నెలకు రూ.1,500 చొప్పున పింఛన్లు ఇస్తున్నారు. ఆసరా పింఛన్ల పథకం లబ్ధిదారుల ఎంపికలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా క్యాంపులు నిర్వహించి వికలత్వాన్ని నిర్ధారిస్తోంది. ఇందులో ప్రత్యేక పరీక్షలు నిర్వహించి... 40 శాతం కంటే ఎక్కువ వైకల్యం ఉన్నవారికి సర్టిఫికెట్లు ఇవ్వడంతో పాటు ఆసరా లబ్ధిదారులుగా ఎంపిక చేస్తున్నారు.
తాజాగా కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో సదరం (సాఫ్ట్వేర్ ఫర్ అసెస్మెంట్ ఆఫ్ డిసేబుల్ ఫర్ యాక్సిస్ రిహబిలిటేషన్ అండ్ ఎంపవర్మెంట్) క్యాంపుల ద్వారా ఇచ్చిన సర్టిఫికెట్లను ప్రామాణికంగా తీసుకోవాలని కోరేందుకు రాష్ట్ర వికలాంగుల సంక్షేమ శాఖ సిద్ధమవుతోంది. ఇప్పటికే వైద్య నిపుణులతో నెలల తరబడి గ్రామాల వారీగా ప్రత్యేక క్యాంపులు నిర్వహించి... యూడీఐడీలో పేర్కొన్న నిబంధనల ప్రకారమే పరీక్షలు నిర్వహించి సర్టిఫికెట్లు జారీ చేస్తున్నందున, సదరం లింకును యూడీఐడీకి జతచేసేలా కోరతామని రాష్ట్ర వికలాంగుల సంక్షేమ శాఖ డైరెక్టర్ శైలజ తెలిపారు.