Special Project
-
వైరస్ల విరుగుడుకు ప్రత్యేక ప్రాజెక్టు
సాక్షి, హైదరాబాద్: భవిష్యత్తులో కరోనా వంటి మహ మ్మారులను నియంత్రించేందుకు... వైరస్‌లకు విరుగుడుగా పనిచేయగల మందులను గుర్తించేందుకు యాంటీ వైరల్ మిషన్ పేరిట ప్రత్యేక ప్రాజెక్టు చేపట్టామని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ) నూతన డైరెక్టర్ డాక్టర్ డి.శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. మందులుగా ఉపయోగపడగల రసాయన పరమాణువుల బ్యాంక్ (మోల్ బ్యాంక్) వైరస్‌లను నాశనం చేసేందుకు ఎంత వరకు ఉపయోగపడుతుందో తెలుసుకొనేందుకు ఈ మిషన్ ఉపకరించనుందని తెలిపారు. అయితే గుర్తించిన మందులను పరీక్షించేందుకు బీఎస్ఎల్–3 స్థాయి పరిశోధనశాల అవసరమవుతుందని, దీని ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. ఇటీవలే పదవీబాధ్యతలు చేపట్టిన శ్రీనివాసరెడ్డి శుక్రవారం విలేకరుల సమావేశంలో తన ప్రాథమ్యాలను వివరించారు. కొత్త రసాయనాలు దోమల్ని చంపేస్తాయి.. డెంగీ, జీకా వంటి వైరల్ వ్యాధులు ప్రబలేందుకు కారణ మైన దోమలను నియంత్రించేందుకు ఇప్పటికే వినూత్న రసాయనాలను గుర్తించినట్లు శ్రీనివాసరెడ్డి తెలిపారు. ప్రస్తుతం వాడుతున్న రిపెల్లెంట్ల రసాయనాల గాఢత ప్రజల ఆరోగ్యంపై ప్రభావం చూపుతోంది. తాము గుర్తించిన కొత్త రసాయనాలు సహజసిద్ధమైన వాటిని పోలి ఉన్నందున ప్రమాదం తక్కువని... పైగా ఇవి దోమలను నిరోధించడమే కాకుండా చంపేస్తాయన్నారు. ప్రస్తుతం పారిశ్రామిక సంస్థలతో కలసి ఈ రసాయనాలను పరీక్షించే ప్రయత్నాల్లో ఉన్నామన్నారు. ఫలితాల ఆధారంగా ముందుకు వెళ్తామన్నారు. అలాగే కేంద్ర నాడీ వ్యవస్థపై ప్రభావం చూపే వ్యాధులకు కొత్త మందులు కనుక్కునేందుకు సిలికాన్ స్విచ్ విధానం ఉపయోగపడుతుందన్నారు. యువ శాస్త్రవేత్తలూ కష్టే ఫలి... సమాజ హితానికి సైన్స్ ఎంతో ఉపయోగపడుతున్నందున శాస్త్రవేత్తలు తమ పరిశోధనల ద్వారా సమాజానికి మేలు జరిగేలా చూడాలని శ్రీనివాసరెడ్డి కోరారు. యువ శాస్త్రవేత్తలు కష్టే ఫలి సిద్ధాంతాన్ని గుర్తించాలన్నారు. అవార్డులు అనేవి కష్టానికి దక్కే ప్రయోజనాలు మాత్రమే అన్నారు. ప్రాజెక్టు అసిస్టెంట్ నుంచి ఐఐసీటీ డైరెక్టర్ దాకా.. నల్లగొండ జిల్లా శోభనాద్రిపురానికి చెందిన సాధార ణ రైతు కుటుంబంలో పుట్టిన డాక్టర్ డి.శ్రీనివాసరె డ్డి దేశంలోనే ప్రతిష్టాత్మక సంస్థ ఐఐసీటీ డైరెక్టర్ స్థానాన్ని చేపట్టడం ఒక విశేషమైతే..జమ్మూలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ మెడిసిన్, లక్నోలోని సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్లకు తాత్కాలిక డైరెక్టర్‌గా వ్యవహరిస్తుండటం మరో విశేషం. ప్రాజెక్టు అసిస్టెంట్‌గా పనిచేసిన ఐఐసీటీకే ఆయన డైరెక్టర్‌గా రావడం గమనార్హం. సూపర్‌వైజర్‌నైతే చాలనుకున్నా... ‘రైతు కుటుంబంలో పుట్టిన నేను టెన్త్ వరకు రామన్నపేటలో, ఇంటర్ సికింద్రాబాద్‌లోని మహబూబ్ కాలేజీలో, బీఎస్సీ (బీజెడ్సీ) సర్దార్ పటేల్ కాలేజీలో చేశా. ఖర్చులకు అవసరమైన డబ్బు సంపాదన కోసం వార్తాపత్రికల పంపిణీ, హోం ట్యూషన్లు, కట్టెల మండీలో పని చేశా. ఆ దశలోనే ఓ సూపర్‌వైజర్‌నైతే చాలనుకున్నా. నిజాం కాలేజీలో ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఎమ్మెస్సీ తర్వాత పీహెచ్డీ చేద్దామనుకున్నా ఫెలోషిప్ లేక ఐఐసీటీలో ప్రాజెక్టు అసిస్టెంట్‌గా చేరా. కొంతకాలానికి సీఎస్ఐఆర్ నెట్ పరీక్ష పాసై ప్రఖ్యాత శాస్త్రవేత్త ప్రొఫెసర్ గోవర్ధన్ మెహతా వద్ద పీహెచ్డీ (సెంట్రల్ యూనివర్సిటీ) చేశా. షికాగో, కాన్సస్ యూనివర్సిటీల్లో చదువుకున్నాక భారత్‌కు తిరిగి వచ్చి పలు ప్రఖ్యాత సంస్థల్లో పనిచేశా. ఆపై విద్యాబోధన వైపు మళ్లా. 2010లో పుణేలోని నేషనల్ కెమికల్ లేబొరేటరీలో చేరా. 2020లో జమ్మూలోని ఐఐఐఎంకు డైరెక్టర్‌గా ఎంపికయ్యా’ అని డాక్టర్ శ్రీనివాసరెడ్డి తన గతాన్ని గుర్తుచేసుకున్నారు. -
ప్రత్యేక ప్రాజెక్టులపై ప్రభుత్వంపై ఒత్తిడి
సాక్షి ప్రతినిధి, విజయనగరం : ‘ఎమ్మెల్యేలూ గళమెత్తండి. వెనుకబడిన జిల్లా అభివృద్ధికి కృషి చేయండి. సమస్యల పరి ష్కారానికి నడుం బిగించండి. నిధుల కేటాయింపు, ప్రత్యేక ప్రాజెక్టులపై ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురండి. ప్రకటించిన అభివృద్ధి పథకాలొచ్చేలా సర్కార్‌ను ప్రశ్నించండి. నవ్యాంధ్ర ప్రదేశ్‌లోనైనా జిల్లా కష్టాలు తీరేలా చొరవ తీ సుకోండి.’ ఇదీ జిల్లా ప్రజల వేడుకో లు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జిల్లాలో ఏ ఒక్క అభివృద్ధి పనీ జరగలేదు. ఎన్నికల ముం దు, ఎన్నికల తర్వాత అరచేతిలో వైకుంఠం చూపించిన చంద్రబా బు ఇప్పుడా హామీల జోలికి పోవడం లేదు. తాను ప్రకటిం చిన వాటిని ఎప్పుడో మరిచి పోయారు. వాటిని ఎమ్మెల్యేలే గుర్తు చేయాలని ప్రజలు కోరుతున్నారు. ఎన్నికలకు ముందు... ఎన్నికలకు ముందు జిల్లాకొచ్చిన ప్రతి సారి విజయనగరం జిల్లాకు ప్రత్యేక నిధులిస్తానని చంద్రబాబు ప్రకటించారు. తోటపల్లితో పాటు తారకరామ తీర్థ సాగర్ ప్రాజెక్టును ఏడాదిలోపు పూర్తి చేస్తామన్నారు. వ్యవసాయ ఉత్పత్తుల అనుబంధ పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇప్పుడున్న జూట్ పరిశ్రమలకు అదనంగా మరికొన్ని తెస్తామన్నారు. కానీ ఇప్పటి వరకు వాటిలో ఏ ఒక్కటీ అమలు చేయలేదు. కనీసం వాటి విషయైమై చర్చించిన దాఖలాల్లేవు. ఎన్నికల తర్వాత... అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా సీఎం జిల్లాపై వరాల జల్లు కురిపించారు. జిల్లా అభివృద్ధి ప్రణాళిక అని తొమ్మిదింటిని ప్రకటించారు. విజయనగరాన్ని స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దుతానని, ప్రభుత్వ మెడికల్ కళాశాల ఏర్పాటు చేస్తామని, గిరిజన యూనివర్సిటీని నెలకొల్పుతామని, ఫుడ్‌పార్క్ ఏర్పాటు చేస్తామని, పారిశ్రామిక నగరంగా తీర్చిదిద్దుతామని, గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ఏర్పాటు చేస్తామని, లలిత కళల అకాడమీని ఏర్పాటు చేస్తానని, నౌకాశ్రయం, హార్డ్‌వేర్ పార్క్‌ను నిర్మిస్తామని, తోటపల్లి ప్రాజెక్టును ఏడాది లోపు పూర్తి చేస్తామని ప్రకటించారు. కానీ ఏదీ కార్యరూపం దాల్చలేదు. గిరిజన యూనివర్సిటీ, ప్రభుత్వ మెడికల్ కళాశాలపై నీలి నీడలు కమ్ము కున్నాయి. మిగతా వాటి సంగతంతేనా..? జిల్లాలో సమస్యలు ఎక్కడికక్కడే ఉన్నాయి. ఫెర్రో అల్లాయిస్ పరిశ్రమలు మూతపడ్డాయి. జ్యూట్ మిల్లుల సమస్య తీరడం లేదు. మూతపడిన పరిశ్రమలు తెరుచుకోవడం లేదు. కార్మికుల ఇళ్లల్లో ఆకలి కేకలు విన్పిస్తున్నాయి. హుద్‌హుద్ తుపాను సాయం అంతంతమాత్రంగానే ఉంది. నష్టానికి, పరిహారానికి ఎక్కడా పొంతన లేదు. పలుచోట్ల అక్రమాలు కూడా జరిగాయి. ఇందిరమ్మ పథకం కింద మంజూరైన ఇళ్లకు బిల్లులు అందడం లేదు. నిధుల్లేవన్న కారణంతో అధికారులు చేతులేత్తేస్తున్నారు. దీంతో నిర్మాణ దశలో ఉన్న ఇళ్లు శిథిలావస్థలోకి వెళ్లిపోతున్నాయి. విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్‌షిప్‌ల పరిస్థితి దయనీయంగా ఉంది. ఇవే కాదు అనేక ఇరిగేషన్, ఉపాధి హామీ, భూసేకరణ, నిధుల్లేమి తదితర సమస్యలు ఉన్నాయి. వీటిన్నింటిపైనా ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ప్రస్తావించాలని, ఓట్లేసి గెలిపించిన ప్రజలు వేడుకుంటున్నారు.