వైజాగ్-గుంటూరు వోల్వో బస్సులో మంటలు
గాజువాక: విజయవాడ మీదుగా గుంటూరు వెళ్లేందుకు వైజాగ్ నుంచి బయల్దేరిన శ్రీకాలేశ్వరి ట్రావెల్స్‌కు చెందిన వోల్వో బస్సులో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఒక్కసారిగా ఎగసిన మంటలకు బస్సు మొత్తం దగ్ధమైపోయింది. ప్రమాదాన్ని గుర్తించిన బస్సులోని 46 మంది ప్రయాణికులు బయటకు దూకేయడంతో ప్రమాదం తప్పింది. ఆదివారం రాత్రి 10.30 గంటల సమయంలో చోటు చేసుకున్న ఈ ప్రమాదంపై ప్రయాణికులు, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. నగరంలోని శ్రీకాలేశ్వరి ట్రావెల్స్‌కు సంబంధించిన వోల్వో బస్సు విజయవాడ వెళ్లడం కోసం విశాఖ సిటీలో బయల్దేరింది.
పాతగాజువాక జంక్షన్‌లోని ఆర్టీసీ ఎక్స్‌ప్రెస్ బస్‌స్టాప్‌వద్ద బస్సు ఎక్కడం కోసం ఒక యువతి సిద్ధంగా ఉండడంతో ఆమెకోసం డ్రైవర్ బస్సు ఆపాడు. బ్రేక్ వేసేసరికి బస్సులో కాలుతున్న వాసనను వెనక సీట్లో ఉన్న ఒక ప్రయాణికుడు గుర్తించాడు. ఆమె ఎక్కేలోపే మంటలు ఒక్కసారిగా పైకి లేచాయి. దీన్ని గమనించిన ఆ ప్రయాణికుడు కేకలు వేయడంతో అందరూ హుటాహుటిన బస్సులో నుంచి బయటకు పరుగులు తీశారు. ఈ ప్రమాదంతో బస్సు డ్రైవర్ సహా సిబ్బంది మొత్తం పరారయ్యారు. ప్రమాద సమాచారం అందుకున్న పెదగంట్యాడ అగ్నిమాపక కేంద్రం సిబ్బంది శకటంతో సహా సంఘటనా స్థలానికి చేరుకొన్నారు. మంటలను అదుపు చేయడానికి సుమారు గంటపాటు శ్రమించారు.