యమునా తీరంలో ‘ఏఓఎల్’కు అనుమతి
♦ జాతీయ హరిత ట్రిబ్యునల్ తీర్పు
♦ ఆర్ట్ ఆఫ్ లివింగ్పై రూ. 5 కోట్ల జరిమానా; డీడీఏ, డీపీసీబీలకూ జరిమానాల వడ్డన
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో యమునా నదీ వరద మైదానంలో ‘ఆర్ట్ ఆఫ్ లివింగ్’ ప్రపంచ సాంస్కృతిక సమ్మేళనం నిర్వహణపై రేగుతున్న వివాదాలను పట్టించుకోకుండా.. జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) ఆ కార్యక్రమానికి అనుమతి మంజూరు చేసింది. అయితే.. శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు జరగనున్న ఈ కార్యక్రమంపై పర్యావరణ పరిహారంగా రూ. 5 కోట్లు జరిమానా విధించింది. ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీపై రూ. 5 లక్షలు, ఢిల్లీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు (డీపీసీబీ)పై రూ. ఒక లక్ష చొప్పున కూడా జరిమానాలు విధించింది.
ఎన్జీటీ చైర్పర్సన్ జస్టిస్ స్వతంతర్కుమార్ సారథ్యంలోని ధర్మాసనం.. కార్యక్రమం మొదలవటానికి ముందు రూ. 5 కోట్లు పరిహారం జమ చేయాలని శ్రీశ్రీ రవిశంకర్ నేతృత్వంలోని ఆర్ట్ ఆఫ్ లివింగ్కు నిర్దేశించింది. ఢిల్లీ-నోయిడాల మధ్య వేయి ఎకరాలకు పైగా సున్నితమైన ప్రాంతం మొత్తాన్నీ ఒక్క గడ్డి పరక కూడా లేకుండా చదును చేశారని.. ఏఓఎల్ను నిలిపివేయాలని కోరుతూ పిటిషన్ వేసిన పర్యావరణ కార్యకర్త ఆనంద్ ఆర్య విచారణలో చెప్పారు. ఏఓఎల్ కార్యక్రమానికి 35 లక్షల మంది హాజరవుతారని అంచనా. అయితే.. రూ. 5 కోట్లు జరిమానా విధించటంపై సుప్రీంలో అప్పీలు చేస్తామని ఏఓఎల్ ప్రకటించింది.
అది పర్యావరణ కోణంలో విపత్తు: హైకోర్టు
ఈ కార్యక్రమం వల్ల పర్యావరణ కోణంలో విపత్తులా కనిపిస్తోందని ఢిల్లీ హైకోర్టు పేర్కొంది. నదీ తీరంలో అక్రమ కట్టడాలపై వాజ్యం కేసులో ఈ కార్యక్రమ ఏర్పాట్ల గురించి ప్రస్తావించింది. తీరంలోని నిర్మాణాలు, సంబంధిత విధివిధానాలు, భూకంప ప్రాంతం నాలుగో జోన్ నిబంధనలకు అనుగుణంగా ఉండేలా చర్యలు చేపట్టాలని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్, డీడీఏ, మునిసిపల్ కార్పొరేషన్లకు నిర్దేశించింది. ఈ కార్యక్రమంలో ఏర్పాట్లలో లోపాలను పరిష్కరించకపోతే అక్కడ తొక్కిసలాట, గందరగోళ పరిస్థితులు ఉత్పన్నమయ్యే ప్రమాదముందని ఢిల్లీ పోలీసులు భావిస్తున్నారు. ప్రధానమంత్రి, ఇతర వీఐపీలు ఆశీనులయ్యే వేదిక వద్ద లోపాలున్నాయన్నారు. ఈ కార్యక్రమానికి సైన్యాన్ని వినియోగించటంపై రాజ్యసభలో ప్రభుత్వంపై విపక్షాలు మండిపడ్డాయి. సున్నితమైన యమునా తీరంలో ఆ కార్యక్రమం నిర్వహించటమే పర్యావరణ విపత్తు అంటూ జేడీయూ, కాంగ్రెస్, సీపీఎం నేతలు తప్పుపట్టారు. దీనికి ప్రభుత్వం స్పందిస్తూ.. అన్ని అనుమతులతోనే ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారన్నారు.