అన్నయ్య భయపడితే చాలు... ఆనందమే!
– రాజమౌళి
‘‘అన్నయ్య (కాంచీ)లో వెటకారం ఎక్కువ. ప్రతి ఒక్కరిలోనూ తప్పులు ఎత్తి చూపిస్తూ వెక్కిరిస్తాడు. తన సినిమాలో తప్పులు ఉండకూడదని కోరుకుంటున్నాను. కానీ, అందరూ కలసి నన్నెక్కడ విమర్శిస్తారోనని అన్నయ్య నిలబడిన తీరు చూస్తే ఆనందంగా ఉంది. తను భయపడితే చాలు... నాకు ఆనందంగా ఉంటుంది’’ అన్నారు ఎస్.ఎస్.రాజమౌళి. ఆయన కజిన్, సంగీత దర్శకుడు కీరవాణి సోదరుడు ఎస్.ఎస్. కాంచీ దర్శకత్వం వహించిన సినిమా ‘షో టైమ్’. రణధీర్, రుక్సార్ మీర్ జంటగా జాన్ సుధీర్ పూదోట నిర్మించిన ఈ సినిమా పాటల్ని హైదరాబాద్‌లో విడుదల చేశారు. కీరవాణి స్వరపరిచిన పాటల సీడీలను అనుష్క విడుదల చేసి, తొలి సీడీని రచయిత శివశక్తి దత్తాకి అందజేశారు. రాజమౌళి థియేట్రికల్ ట్రైలర్ విడుదల చేశారు. ఈ నెలలోనే చిత్రాన్ని విడుదల చేస్తామని నిర్మాత జాన్ సుధీర్ పూదోట తెలిపారు.
‘‘ఓ థియేటర్లో జరిగే కథే ఈ సినిమా. ట్రైలర్ చూస్తుంటే సినిమా ఎప్పుడు చూస్తామా? అనే ఆసక్తి కలుగుతోంది’’ అన్నారు కె. రాఘవేంద్రరావు. ‘‘ప్రత్యేక గీతాలు, ఫైట్లు లేకుండా ప్రేక్షకులు ఆస్వాదించేలా కాంచీ సినిమా తీశాడు’’ అన్నారు కీరవాణి. కాంచీ మాట్లాడుతూ –‘‘నన్నెవరైనా విమర్శిస్తే సంతోషమే. నా తప్పులు తెలుసుకుంటాను. కానీ, నన్నెవరూ విమర్శించకుండా, నా తప్పులు వెతికే అవకాశం వాళ్లకి రాకూడదనే తపనతో ఈ సినిమా తీశా. సినిమాలో తప్పులేవైనా ఉంటే అవి నావి, ఒప్పులు మా టీమ్‌కి చెందుతాయి’’ అన్నారు. ‘‘మా అబ్బాయి కార్తికేయ బాగా పాడతాడని ఈ సినిమాలో పాట వినేవరకూ తెలియదు’’ అన్నారు రాజమౌళి. రచయిత విజయేంద్రప్రసాద్, నిర్మాత పీవీపీ, దర్శకుడు వైవీయస్ చౌదరి, సంగీత దర్శకుడు కల్యాణ రమణ తదితరులు పాల్గొన్నారు.