ఒలింపిక్ పతకమే అత్యున్నతం
పీవీ సింధు అభిప్రాయం
ముంబై: ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో పతకం సాధించడం కన్నా ప్రతిష్టాత్మక ఒలింపిక్స్‌లో పోడియం మీద నిలబడటం అన్నింటికన్నా అత్యుత్తమమని బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు స్పష్టం చేసింది. 2013, 14 ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో తను కాంస్యాలు సాధించి భారత్ తరఫున రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. అయితే ఇవేవీ ఒలింపిక్స్ పతకానికి సాటిరావని అభిప్రాయపడింది. ‘ప్రపంచ చాంపియన్‌షిప్స్ కన్నా ఒలింపిక్స్ చాలా పెద్ద ఈవెంట్.
ఏ క్రీడాకారుడికైనా అంతిమ లక్ష్యం ఒలింపిక్ పతకం సాధించడమే. ఎందుకంటే అక్కడ ఉండే పోటీ, పరిస్థితులు అన్నీ విభిన్నం. రియో గేమ్స్ నా తొలి ఒలింపిక్స్. దీంతో చాలా ఉద్వేగంగా ఉన్నాను. భారత్ నుంచి ఈసారి ఏడుగురు ఆటగాళ్లు ప్రాతినిధ్యం వహించబోతున్నారు. మా నుంచి అందరూ పతకాలు ఆశిస్తున్న విషయం తెలుసు. దీనికోసం శాయశక్తులా పోరాడతాం’ అని సింధు తెలిపింది.