చిత్తూరు ఎస్పీ బదిలీ
చిత్తూరు(క్రైమ్), న్యూస్‌లైన్: చిత్తూరు ఎస్పీ కాంతిరాణాటాటాను మాదాపూర్ డీసీపీగా బదిలీ చేస్తూ రాష్ట్ర డీజీపీ ప్రసాద్‌రావ్ ఆదేశాలు జారీ చేశారు. ఆయన స్థానం లో స్టేట్ ఇంటలిజెన్స్‌బ్యూరో (ఎస్ఐబీ) హైదరాబాద్‌లో పనిచేసే పీహెచ్డీ.రామకృష్ణను నియమించారు. చిత్తూరు ఎస్పీగా కాంతిరాణాటాటా 2011 జూన్ 12న బాధ్యతలు స్వీకరించారు. అప్పటి నుంచీ ఎర్రచందనంపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి స్మగ్లర్ల గుండెల్లో దడ పుట్టించారు. శేషాచలం అడవుల్లోని ఎర్రబంగారం రవాణాను అరికట్టడానికి సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నారు.
అటవీశాఖకు చిక్కకుండా, కనీసం ముఖచిత్రమూ తెలవని మోస్ట్‌వాంటెడ్ స్మగ్లర్ల ఆటకట్టించడంలో సఫలీకృతులయ్యారు. దీంతో పాటు ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకొని పరిష్కరించాలనే సంకల్పతో ‘డయల్ యువర్ ఎస్పీ’ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు. జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. నేరాలను అదుపుచేయడానికి ప్రత్యేక ప్రణాళికతో ముందుకెళ్లి నేరస్తులను పట్టుకొని రూ.కోట్ల సొమ్ము రికవరీ చేశారు. చోరీ సొమ్ము రికవరీలో 2011-2012, 2012-13 సంవత్సరాల్లో వరుసగా రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచారు. జిల్లాలో పనిచేసే పోలీసులందరికీ ఉపయోగపడేలా పోలీస్ క్యాంటిన్, వివాహాలకు కల్యాణ మండపం ఏర్పాటుకు ఆయన కృషిచేశారు. ఇటీవల పుత్తూరులో తీవ్రవాదులను పట్టుకోవడంలో కీలకపాత్ర పోషించి రాష్ట్ర స్థాయిలో పోలీసు ఉన్నతాధికారులు, ప్రభుత్వం నుంచి ప్రశంసలు పొందారు.
ప్రజలు, అధికారుల సహకారం మరువలేను
చిత్తూరు జిల్లాలో ఎస్పీగా రెండు సంవత్సరాల నాలుగు నెలలు సమర్థవంతంగా పనిచేయడం తన అదృష్టంగా భావిస్తున్నానని ఎస్పీ కాంతిరాణాటాటా తెలిపారు. బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి జిల్లాలో శాంతిభద్రతలను కాపాడడంలో ప్రజలు, పోలీసు సిబ్బంది సహకారం మరువలేనిదన్నారు. ముఖ్యంగా జిల్లాలో ఎర్రచందనం రవాణాపై ఉక్కుపాదం మోపి రూ.కోట్ల విలువైన సంపదను కాపాడాననే సంతృప్తి కలిగిందన్నారు. పుత్తూరులో తీవ్రవాదులను పట్టుకోవడం కోసం నిర్వహించిన ఆపరేషన్ విజయవంతం కావడం ఎప్పటికీ మరువలేనన్నారు. ఎర్రచందనం కాపాడటం, డయల్ యువర్ ఎస్పీ ద్వారా ప్రజల సమస్యలు పరిష్కరించడం, నేరాలను తగ్గించి అత్యధికంగా రికవరీలు చేయడం ఎంతో సంతృప్తినిచ్చిందన్నారు. తనకు సహకరించిన ప్రజలకు, పోలీసు సిబ్బందికి ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్నారు.