నడిగడ్డను నట్టేట ముంచుతారా?
కొండేరు (ఇటిక్యాల) : నడిగడ్డ ప్రాంత రైతులను గద్వాల ఎమ్మెల్యే డీకే అరుణ నట్టేట ముంచుతున్నారని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి ఆరోపించారు. శనివారం ఇటిక్యాల మండలం కొండేరులో విలేకరులతో ఆయన మాట్లాడారు. గట్టు మండలంలో ప్రభుత్వం 4టీఎంసీల సామర్థ్యంతో ర్యాలంపాడు రిజర్వాయర్ నిర్మిస్తే ఆమె మాత్రం 2టీఎంసీల నీటిని నిల్వ ఉంచాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావుకి లేఖ రాయడం ఇందుకు నిదర్శనమన్నారు. దీనివల్ల 20వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు, ఐజ నగరపంచాయతీకి తాగునీరు అందకుండా పోతుందన్నారు.
ముంపు గ్రామమైన ఆలూరు నిర్వాసితులకు సమైక్య రాష్ట్రంలోనే అన్ని వసతులు కల్పించి ఉంటే ఇప్పటి పరిస్థితి ఉండేదికాదన్నారు. జిల్లాలో నెట్టెంపాడు, కోయిల్‌సాగర్, కల్వకుర్తి, భీమా, రంగసముద్రం ఎత్తిపోతల పథకాల ద్వారా భీడుభూముల దప్పిక తీరుస్తున్నామన్నారు. ఈ సమావేశంలో మాజీ ఎంపీ మందా జగన్నాథం, జోగులాంబ ఆలయ కమిటీ మాజీ చైర్మన్ నారాయణరెడ్డి, అలంపూర్ మాజీ ఎంపీపీ ప్రకాశ్‌గౌడ్, న్యాయవాది విష్ణువర్ధన్‌రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు వడ్డేపల్లి శ్రీనివాసులు, జింకలపల్లి రాంరెడ్డి, గోవర్దన్‌రెడ్డి, జయసాగర్, తెలంగాణ పరశురాముడు, తిమ్మన్ననాయుడు, వల్లూరు గిడ్డారెడ్డి పాల్గొన్నారు.