strengthen security
-
తీరంలో నిఘా!
► భద్రత మరింత పటిష్టం ► ఉమ్మడి ఆపరేషన్లు ► చెన్నైలో కోస్టల్ అధికారుల మహానాడు సాక్షి, చెన్నై : సముద్ర తీరాల్లో భద్రత పటిష్టం లక్ష్యంగా ఉమ్మడి ఆపరేషన్లు సాగనున్నాయి. ఇందుకు తగ్గ సమీక్షల్లో అధికార వర్గాలు నిమగ్నమయ్యారు. పలు రాష్ట్రాల పోలీసు అధికారులు, రాష్ట్రంలోని సముద్ర తీరంలోని 13 జిల్లాల్లోని ఎస్పీలు, రాష్ట్ర డీజీపీ, సముద్ర తీర భద్రతా విభాగం వర్గాలు సమాలోచనలో మునిగారు. ముంబై పేలుళ్ల నిందితులు సముద్ర మార్గం గుండా దేశంలోకి చొరబడ్డట్టు విచారణలో తేలిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి దేశంలోని సముద్ర తీర రాష్ట్రాల్లో భద్రతను తీరం వెంబడి కట్టుదిట్టం చేశారు. తీరం భద్రత లక్ష్యంగా ప్రత్యేక విభాగాలు ఏర్పాటయ్యాయి. ప్రతి ఏటా ఆరు నెలలకు ఓ సారి మాక్ డ్రిల్‌తో భద్రతా వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నారు. రాష్ట్రంలో అయితే, చెన్నైలో భద్రత ఎప్పుడు కట్టుదిట్టంగానే ఉంటుంది.మిగిలిన 13 సముద్ర తీర జిల్లాల్లో సముద్ర తీర భద్రతా విభాగం నేతృత్వంలో ప్రత్యేక అవుట్ పోస్టులతో తనిఖీలు, గస్తీ ముమ్మరంగా సాగుతూనే ఉంది. అయినా, సముద్ర మార్గంలో చాప కింద నీరులా స్మగ్లింగ్ సాగుతున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇందుకు అద్దం పట్టే ఘటనలు కొన్ని వెలుగులోకి సైతం వచ్చాయి. అలాగే, అసాంఘిక శక్తులు, ముష్కర మద్దతుదారుల కదలికలు రాష్ట్రంలో తరచూ తెరమీదకు వస్తుండడంతో సముద్ర తీరం వైపు భద్రత పటిష్టం లక్ష్యంగా ఉమ్మడిగా ముందుకు సాగాల్సిన అవసరం ఏర్పడింది. ఇందుకుగాను, దేశంలోని 13 రాష్ట్రాల్లోని పోలీసు విభాగాలతో రాష్ట్ర పోలీసు యంత్రాంగం సమష్టిగా ముందుకు సాగేందుకు నిర్ణయించింది. ఆయా తీరాల నుంచి ఎప్పటికప్పుడు వచ్చే సమాచారాల బదలాయింపులు, భద్రత పరంగా చేపట్టాల్సిన అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకునేందుకు చెన్నైలో గురువారం పోలీసు అధికారుల ఉమ్మడి మహానాడు ప్రారంభమైంది. రెండు రోజుల పాటు డీజీపీ కార్యాలయంలో ఈ సమావేశం సాగనుంది. ఉదయం జరిగిన కార్యక్రమంలో డీజీపీ రాజేంద్రన్ సమావేశాన్ని ప్రారంభించారు. సముద్ర తీర భద్రతా విభాగం అదనపు డీజీపీ శైలేంద్ర బాబు నేతృత్వం వహించారు. సాగర తీరంలో భద్రతను మరింత పటిష్టవంతం చేయడం లక్ష్యంగా సమీక్ష సాగింది. ఉమ్మడిగా ముందుకు సాగేందుకు తగ్గ కార్యచరణను సిద్ధం చేసుకునే పనిలో ఆయా రాష్ట్రాల అధికారులు నిమగ్నమయ్యారు. తమకు వచ్చే సమాచారాలు, ఇతర రాష్ట్రాలకు తెలియజేయడం, నిఘాతో వ్యవహరించడం, ఏదేని చొరబాట్లు వెలుగులోకి వస్తే, ఉమ్మడి ఆపరేషన్ సాగించడం, సవాళ్లు ఎదుర్కొనడం జాలర్ల గ్రామాల్లో సమావేశాలు, వారి నుంచి సమాచారాలు రాబట్టడం, అత్యాధునిక పరిజ్ఞానం వంటి అంశాలపై చర్చించారు. ఆయా రాష్ట్రాల్లోని సముద్ర తీరాల్లో చేపట్టి ఉన్న భద్రత, తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు. శుక్రవారం చర్చ అనంతరం కీలక నిర్ణయాలను ఈ సమావేశంలో తీసుకోనున్నారు. వాటిని ఆచరణలో పెట్టే విధంగా ఉమ్మడిగా ఆయా రాష్ట్రాలు, రాష్ట్రంలో జిల్లాల్లోని అధికారులు ఆచరణలో పెట్టేందుకు సిద్ధమవుతారు. ఈ కార్యక్రమానికి ఆంధ్ర, కర్ణాటకలతో పాటు ఇతర సముద్ర తీర రాష్ట్రాల అధికారులు, కోస్టుగార్డు వర్గాలు, నౌకాదళం వర్గాలు, మత్స్యశాఖ అధికారులు పాల్గొన్నారు. -
పటిష్ట భద్రత
ఎన్నికల తేదీ సమీపిస్తుండడంతో పటిష్ట భద్రత నిమిత్తం పారా మిలటరీ బలగాలు రంగంలోకి దిగాయి. ఆదివారం ఓ బృందం చెన్నైకు చేరుకుంది. వీరిని తిరువళ్లూరు, కాంచీపురం, విల్లుపురం జిల్లాలకు పంపించారు. బూత్ స్లిప్పుల పంపిణీ ముగియడంతో, ఓటుకు నోటు అడ్డుకట్టే లక్ష్యంగా గస్తీకి ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. ఈ బృందాల తనిఖీల్లో రూ.పది కోట్లు పట్టుబడ్డాయి. సాక్షి, చెన్నై: రాష్ట్రంలో ఎన్నికల తేదీ సమీపించింది. ఎన్నికలకు మరో రెండు రోజులు మాత్రమే సమయం ఉండడంతో నగదు బట్వాడా అడ్డుకట్టే లక్ష్యంగా, ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ప్రవీణ్‌కుమార్ బందోబస్తును పెంచారు. రాష్ట్రం లోని పోలింగ్ బూత్‌లలో 9,226 సమస్యాత్మకంగా గుర్తించారు. ఇందులో 1337 కేంద్రాలు అత్యంత సమస్యత్మాకమైనవిగా తేల్చారు. ఈ కేంద్రాల్లో భద్రతను కట్టుదిట్టం చేయడానికి అన్ని చర్యలు తీసుకున్నారు. రంగంలోకి పారా మిలటరీ బలగాలను దించారు. నగదు రవాణా అడ్డుకట్టే లక్ష్యం: రాష్ట్రంలో ఇప్పటికే స్థానిక పోలీసులు, పక్క రాష్ట్రాల ప్రత్యేక పోలీసు బృందాలు విధుల్లో నిమగ్నమయ్యూయి. ఎన్నికల్లో నగదు రవాణా అడ్డుకట్ట లక్ష్యంగా చేసుకుని తనిఖీలు ముమ్మరం అయ్యాయి. ఇప్పటి వరకు సుమారు రూ.37 కోట్లకు పైగా నగదు, వస్తువులు లెక్కలోకి రానివి పట్టుబడి ఉన్నాయి. ఎన్నికల తేదీ సమీపించే కొద్దీ ఓటర్లను ప్రలోభాలకు గురి చేయడానికి రాజకీయ పక్షాలు సిద్ధమవుతుండడాన్ని పసిగట్టిన ఎన్నికల యంత్రాంగం పారా మిలటరీ బలగాలను రంగంలోకి దించింది. రాష్ట్రంలో భద్రతా విధుల నిమిత్తం 32 కంపెనీలకు చెందిన 3200 మంది పారా మిలటరీ సిబ్బందిని ఇక్కడికి రప్పించే ఏర్పాట్లు చేశారు. ఈ బృందాలు పలు రాష్ట్రాల నుంచి ఇక్కడికి చేరుకుంటున్నాయి. శనివారం రాత్రి రెండు కంపెనీల బృందాలు ఇక్కడికి చేరుకోగా, ఆదివారం మరో మూడు కంపెనీల బృందాలు చెన్నైకు వచ్చాయి. ఎగ్మూర్, సెంట్రల్ రైల్వే స్టేషన్లకు చేరుకున్న ఈ బృందాలను భద్రతా విధుల నిమిత్తం విల్లుపురం, తిరువళ్లూరు, కాంచీపురం వేలూరు, అరక్కోణం లోక్ సభ నియోజకవర్గాలకు పంపించారు. మరి కొన్ని బృందాలు నేరుగా తిరుచ్చి, కోయంబత్తూరు, తిరునల్వేలికి చేరుకున్నాయి. సోమవారం సాయంత్రంలోపు 32 కంపెనీలకు చెందిన పారా మిలిటరీ రాష్ట్రంలోని ఆయా లోక్‌సభ నియోజకవర్గాలకు చేరనున్నది. 1337 అత్యంత సమస్యాత్మక కేంద్రాల్లో భద్రతను పూర్తి స్థాయిలో పారా మిలటరీ పర్యవేక్షించనున్నది. ప్రత్యేక బృందాలు : ఓటర్లను ప్రలోభపెట్టేందుకు రాజకీయ పార్టీలు చేసే ప్రయత్నాలను అడ్డుకోవడానికి ప్రత్యేక బృందాలు ఆదివారం ఉదయం నుంచి రంగంలోకి దిగాయి. ఫ్లయింగ్ స్క్వాడ్లతో సంబంధం లేకుండా ఈ ప్రత్యేక బృందాలు విధుల్లోకి దిగాయి. ప్రతి పది కేంద్రాలను మండలంగా ఏర్పాటు చేసి, 5,360 బృందాలను రంగంలోకి దించారు. ఈ బృందంలో ఒక అధికారి, ఒక సహాయ అధికారి, ఐదుగురు పోలీసులు ఉన్నారు. ఎన్నికలయ్యే వరకు ఈ బృందాలు గస్తీలోనే ఉంటాయి. ఎక్కడైనా నగదు బట్వాడా జరుగుతున్నట్టు తెలిస్తే, వారిని అరెస్టు చేసే అధికారం ఈ బృందాలకు ఉంటుంది.రూ. పది కోట్లు పట్టి వేత: ఎన్నికల విధుల్లో ఉన్న ఫ్లయింగ్ స్క్వాడ్ తనిఖీల్లో రూ.పది కోట్ల మేరకు నగదు, బంగారు బిస్కెట్లు పట్టుబడ్డాయి. తిరుప్పూర్ అవినాశి రోడ్డులో తనిఖీల్లో ఉన్న ఓ ప్రత్యేక బృందం ఓ కారును తనిఖీ చేసింది. అందులో రూ. వెయి, 500 నోట్ల కట్టలు కనిపించాయి. అయితే, ఆ నగదు ఏటీఎంలో అమర్చేందుకు తీసుకె ళుతున్నట్టు డ్రైవర్ ఇసక్కి రాజ్ పేర్కొనడంతో అనుమానం వచ్చి లెక్కించారు. డ్రైవర్ 98 లక్షలు ఉన్నట్టు పేర్కొనగా, అధికారుల లెక్కల్లో రూ.కోటి తొమ్మిది లక్షలు ఉన్నట్టు తేలింది. దీంతో నగదును సీజ్ చేసి విచారణ జరుపుతున్నారు. తిరునల్వేలి సమీపంలోని ఓ కారులో తనిఖీలు చేసిన ఫ్లయింగ్ స్క్వాడ్ బంగారు బిస్కెట్లు స్వాధీనం చేసుకుంది. 30 కిలోల ఆ బంగారు బిస్కెట్ల ధరను రూ.8.5కోట్లుగా నిర్ధారించారు. అయితే, ఈ బిస్కెట్లు మదురై, నాగుర్ కోయిల్లలోని అతి పెద్ద నగల షోరూంకు చెందినవిగా, వీటికి సంబంధించిన అన్ని రికార్డులు ఉన్నట్టు ఆ వాహనంలోని సిబ్బంది పేర్కొన్నా, పోలీసులు మాత్రం విచారణకు నిర్ణయించారు. ఇక, తిరునల్లారు శనీశ్వర ఆలయ దర్శనం ముగించుకుని ఓ కుటుంబం కారులో తేనికి వెళ్తోండగా, ఫ్లయింగ్ స్క్వాడ్ అడ్డగించింది. ఆ కారును తనిఖీ చేయగా అందులో రూ.లక్ష బయట పడింది. అయితే, తాను ఈ లక్ష ఏటీఎంలు తీశానని ఆ కారులో ఉన్న వ్యక్తి పేర్కొన్నా, పోలీసులు ఖాతరు చేయలేదు. చివరకు విచారణలో ఆ వ్యక్తి రాష్ట్ర మంత్రి ఓ పన్నీరు సెల్వం సహాయకుడిగా తేలింది. ఆయన వద్ద విచారణ జరుపుతున్నారు. ముగిసిన బూత్ స్లిప్పుల పంపిణీ: ఓటర్లకు ఎన్నికల యంత్రాంగం బూత్స్లిప్పులను పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. దీని ఆధారంగా నేరుగా పోలింగ్ బూత్‌లకు వెళ్లి ఓట్లు వేసే అవకాశం ఉంది. ఈ బూత్ స్లిప్పుల పంపిణీ ప్రక్రియను ఆదివారంతో ముగించేశారు. ఎవరైనా స్లిప్పులు పొందని పక్షంలో, ఆయా పరిధిలోని తాలుకా కార్యాలయాలు, ఎన్నికల అధికారుల కార్యాలయాల్లో ఎన్నికల రోజు వరకు వెళ్లి స్వీకరించ వచ్చని ఈసీ పేర్కొంది. ఎన్నికల తేదీ సమీపించడంతో ఈవీఎంలలో ఆయా పార్టీల చిహ్నాలు, అభ్యర్థుల పేర్లు పొందు పరిచే ప్రక్రియ వేగవంతం అయింది. మంగళవారం సాయంత్రంలోపు ఈ ప్రక్రియను ముగించనున్నారు. ఆయా రాజకీయ పార్టీల అభ్యర్థులకు సంబంధించిన ప్రతినిధుల సమక్షంలో వీటిని పొందు పరుస్తున్నారు. -
సినిమా థియేటర్లలో భద్రత పటిష్టం
ప్యారిస్, న్యూస్‌లైన్ : భద్రతా ఏర్పాట్లను పటిష్టం చేసే రీతిలో సినిమా థియేటర్ల లోపల, బయట నిఘా కెమెరాలను తప్పనిసరిగా అమర్చాలని పోలీసు శాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. నగరంలో భద్రతా చర్యలను పెంపొందించే రీతిలో పోలీసులు చర్యలు చేపడుతున్నారు. ఈ స్థితిలో కమిషనర్ కార్యాలయంలో సినిమా థియేటర్ల యజమానులతో బుధవారం సమావేశమయ్యూరు. అదనపు కమిషనర్ రాజేష్ దాస్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో 50కి పైగా థియేటర్ల యజమానులు, పోలీసుల అధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో కొన్ని సూచనలు చేశారు. చెన్నైలో ఉన్న అన్ని సినిమా థియేటర్లు పూర్తి భద్రతతో ఉన్నాయని యజమానులు హామీ ఇవ్వాలి. అందరినీ మెటల్ డిటెక్టర్ ద్వారా తనిఖీ జరిపిన తర్వాతనే థియేటర్ లోపలికి అనుమతించాలి. వారు తీసుకు వచ్చే హ్యాండ్ బ్యాగు, వస్తువులను వేరుగా స్కానింగ్ చేసి, తనిఖీ చేయాలి. కార్లు, బైకులను పార్కింగ్ చేసే ముందు తనిఖీ చేయాలి. పార్కింగ్ చేసే సమయంలో వాటి నెంబర్లు కనిపించే రీతిలో కెమెరాలను అమర్చాలి. సినిమా థియేటర్ల లోపల మాత్రమే కాకుండా వెలుపలి వైపున కూడా నిఘా కెమెరాలను అమర్చాలి. థియేటర్ లోపల అనుమానంగా ఉండే ఏవైనా వస్తువులు గమనిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలన్న విషయం తెలిపే రీతిలో తెరపై ప్రకటనలను ప్రదర్శించాలి. థియేటర్‌లోపల టికెట్లు ఇచ్చే ప్రాంతం, క్యాంటిన్లలో కూడా నిఘా కెమెరాలు పెట్టాలి. ఇలాంటి సూచనలతో ఉత్తర్వులను పోలీసు అధికారులు జారీ చేశారు. -
విమానాశ్రయం వద్ద భద్రత పటిష్టం
మధురపూడి, న్యూస్‌లైన్ :మధురపూడిలోని విమానాశ్రయం వద్ద పోలీసు బందోబస్తును మరింత పటిష్టం చేశామని, ఇందులో భాగంగా బీఎస్ఎఫ్ దళాలతో నిరంతర గస్తీ నిర్వహిస్తున్నట్టు రాజమండ్రి అర్బన్ జిల్లా ఎస్పీ రవికుమార్ మూర్తి తెలిపారు. మంగళవారం సాయంత్రం ఆయన ఎయిర్‌పోర్టులో వార్షిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ‘న్యూస్‌లైన్’తో మాట్లాడుతూ మిగిలిన పోలీసు స్టేషన్లకు, ఎయిర్‌పోర్టులో పోలీసు స్టేషన్‌కు చాలా వ్యత్యాసం ఉందన్నారు. ఇక్కడ విమానాశ్రయానికి, అందులో ఉన్న పరికరాలు, భవనాలకు బందోబస్తు నిర్వహిస్తారని చెప్పారు. ప్రయాణికులు, వారి లగేజి తనిఖీలు తదితర అంశాలు క్షుణ్ణంగా పరిశీలించడం, రక్షణ కల్పించడం చేస్తారన్నారు. విద్రోహ శక్తుల నుంచి కాపాడడానికి నిరంతర పర్యవేక్షణతో పాటు, రేయింబవళ్లు ప్రత్యేక కూంబింగ్, పెట్రోలింగ్ చేస్తారని వివరించారు. విమానాశ్రయం రోడ్డుకు రెండువైపులా పోలీస్ పికెట్ ఏర్పాటు చేసినట్టు చెప్పారు. రోజురోజుకూ రాజమండ్రి విమానాశ్రయం వినియోగంతో పాటుగా ప్రాధాన్యం కూడా పెరిగిందన్నారు. అనంతరం ఆయన నిఘా వ్యవస్థను, రక్షణ, బందోబస్తు నిర్వహణను సమీక్షించారు. ఆయన వెంట కోరుకొండ ఉత్తర మండల డీఎస్పీ జి.మురళీకృష్ణ, కోరుకొండ సర్కిల్ ఇన్స్పెక్టర్ సన్యాసిరావు, ఎస్సైలు కనకారావు, వెంకటేశ్వరరావు, ఎయిర్‌పోర్టు పోలీసులు ఉన్నారు.