తీరంలో నిఘా!
► భద్రత మరింత పటిష్టం
► ఉమ్మడి ఆపరేషన్లు
► చెన్నైలో కోస్టల్ అధికారుల మహానాడు
సాక్షి, చెన్నై : సముద్ర తీరాల్లో భద్రత పటిష్టం లక్ష్యంగా ఉమ్మడి ఆపరేషన్లు సాగనున్నాయి. ఇందుకు తగ్గ సమీక్షల్లో అధికార వర్గాలు నిమగ్నమయ్యారు. పలు రాష్ట్రాల పోలీసు అధికారులు, రాష్ట్రంలోని సముద్ర తీరంలోని 13 జిల్లాల్లోని ఎస్పీలు, రాష్ట్ర డీజీపీ, సముద్ర తీర భద్రతా విభాగం వర్గాలు సమాలోచనలో మునిగారు. ముంబై పేలుళ్ల నిందితులు సముద్ర మార్గం గుండా దేశంలోకి చొరబడ్డట్టు విచారణలో తేలిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి దేశంలోని సముద్ర తీర రాష్ట్రాల్లో భద్రతను తీరం వెంబడి కట్టుదిట్టం చేశారు. తీరం భద్రత లక్ష్యంగా ప్రత్యేక విభాగాలు ఏర్పాటయ్యాయి.
ప్రతి ఏటా ఆరు నెలలకు ఓ సారి మాక్ డ్రిల్‌తో భద్రతా వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నారు. రాష్ట్రంలో అయితే, చెన్నైలో భద్రత ఎప్పుడు కట్టుదిట్టంగానే ఉంటుంది.మిగిలిన 13 సముద్ర తీర జిల్లాల్లో సముద్ర తీర భద్రతా విభాగం నేతృత్వంలో ప్రత్యేక అవుట్ పోస్టులతో తనిఖీలు, గస్తీ ముమ్మరంగా సాగుతూనే ఉంది. అయినా, సముద్ర మార్గంలో చాప కింద నీరులా స్మగ్లింగ్ సాగుతున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇందుకు అద్దం పట్టే ఘటనలు కొన్ని వెలుగులోకి సైతం వచ్చాయి.
అలాగే, అసాంఘిక శక్తులు, ముష్కర మద్దతుదారుల కదలికలు రాష్ట్రంలో తరచూ తెరమీదకు వస్తుండడంతో సముద్ర తీరం వైపు భద్రత పటిష్టం లక్ష్యంగా ఉమ్మడిగా ముందుకు సాగాల్సిన అవసరం ఏర్పడింది. ఇందుకుగాను, దేశంలోని 13 రాష్ట్రాల్లోని పోలీసు విభాగాలతో రాష్ట్ర పోలీసు యంత్రాంగం సమష్టిగా ముందుకు సాగేందుకు నిర్ణయించింది. ఆయా తీరాల నుంచి ఎప్పటికప్పుడు వచ్చే సమాచారాల బదలాయింపులు, భద్రత పరంగా చేపట్టాల్సిన అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకునేందుకు చెన్నైలో గురువారం పోలీసు అధికారుల ఉమ్మడి మహానాడు ప్రారంభమైంది. రెండు రోజుల పాటు డీజీపీ కార్యాలయంలో ఈ సమావేశం సాగనుంది. ఉదయం జరిగిన కార్యక్రమంలో డీజీపీ రాజేంద్రన్ సమావేశాన్ని ప్రారంభించారు.
సముద్ర తీర భద్రతా విభాగం అదనపు డీజీపీ శైలేంద్ర బాబు నేతృత్వం వహించారు. సాగర తీరంలో భద్రతను మరింత పటిష్టవంతం చేయడం లక్ష్యంగా సమీక్ష సాగింది. ఉమ్మడిగా ముందుకు సాగేందుకు తగ్గ కార్యచరణను సిద్ధం చేసుకునే పనిలో ఆయా రాష్ట్రాల అధికారులు నిమగ్నమయ్యారు. తమకు వచ్చే సమాచారాలు, ఇతర రాష్ట్రాలకు తెలియజేయడం, నిఘాతో వ్యవహరించడం, ఏదేని చొరబాట్లు వెలుగులోకి వస్తే, ఉమ్మడి ఆపరేషన్ సాగించడం, సవాళ్లు ఎదుర్కొనడం జాలర్ల గ్రామాల్లో సమావేశాలు, వారి నుంచి సమాచారాలు రాబట్టడం, అత్యాధునిక పరిజ్ఞానం వంటి అంశాలపై చర్చించారు.
ఆయా రాష్ట్రాల్లోని సముద్ర తీరాల్లో చేపట్టి ఉన్న భద్రత, తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు. శుక్రవారం చర్చ అనంతరం కీలక నిర్ణయాలను ఈ సమావేశంలో తీసుకోనున్నారు. వాటిని ఆచరణలో పెట్టే విధంగా ఉమ్మడిగా ఆయా రాష్ట్రాలు, రాష్ట్రంలో జిల్లాల్లోని అధికారులు ఆచరణలో పెట్టేందుకు సిద్ధమవుతారు. ఈ కార్యక్రమానికి ఆంధ్ర, కర్ణాటకలతో పాటు ఇతర సముద్ర తీర రాష్ట్రాల అధికారులు, కోస్టుగార్డు వర్గాలు, నౌకాదళం వర్గాలు, మత్స్యశాఖ అధికారులు పాల్గొన్నారు.