విమానాశ్రయం వద్ద భద్రత పటిష్టం
Published Wed, Dec 4 2013 3:02 AM | Last Updated on Sat, Sep 2 2017 1:13 AM
మధురపూడి, న్యూస్‌లైన్ :మధురపూడిలోని విమానాశ్రయం వద్ద పోలీసు బందోబస్తును మరింత పటిష్టం చేశామని, ఇందులో భాగంగా బీఎస్‌ఎఫ్ దళాలతో నిరంతర గస్తీ నిర్వహిస్తున్నట్టు రాజమండ్రి అర్బన్ జిల్లా ఎస్పీ రవికుమార్ మూర్తి తెలిపారు. మంగళవారం సాయంత్రం ఆయన ఎయిర్‌పోర్టులో వార్షిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ‘న్యూస్‌లైన్’తో మాట్లాడుతూ మిగిలిన పోలీసు స్టేషన్లకు, ఎయిర్‌పోర్టులో పోలీసు స్టేషన్‌కు చాలా వ్యత్యాసం ఉందన్నారు. ఇక్కడ విమానాశ్రయానికి, అందులో ఉన్న పరికరాలు, భవనాలకు బందోబస్తు నిర్వహిస్తారని చెప్పారు.
ప్రయాణికులు, వారి లగేజి తనిఖీలు తదితర అంశాలు క్షుణ్ణంగా పరిశీలించడం, రక్షణ కల్పించడం చేస్తారన్నారు. విద్రోహ శక్తుల నుంచి కాపాడడానికి నిరంతర పర్యవేక్షణతో పాటు, రేయింబవళ్లు ప్రత్యేక కూంబింగ్, పెట్రోలింగ్ చేస్తారని వివరించారు. విమానాశ్రయం రోడ్డుకు రెండువైపులా పోలీస్ పికెట్ ఏర్పాటు చేసినట్టు చెప్పారు. రోజురోజుకూ రాజమండ్రి విమానాశ్రయం వినియోగంతో పాటుగా ప్రాధాన్యం కూడా పెరిగిందన్నారు. అనంతరం ఆయన నిఘా వ్యవస్థను, రక్షణ, బందోబస్తు నిర్వహణను సమీక్షించారు. ఆయన వెంట కోరుకొండ ఉత్తర మండల డీఎస్పీ జి.మురళీకృష్ణ, కోరుకొండ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ సన్యాసిరావు, ఎస్సైలు కనకారావు, వెంకటేశ్వరరావు, ఎయిర్‌పోర్టు పోలీసులు ఉన్నారు.
Advertisement
Advertisement