సంపూర్ణ అక్షరాస్యత సాధించాలి
విజయవాడ : జిల్లాలో సంపూర్ణ అక్షరాస్యత సాధించే దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సబ్‌కలెక్టర్ డాక్టర్ జి.సృజన పేర్కొన్నారు. శుక్రవారం సబ్‌కలెక్టర్ కార్యాలయంలో జిల్లాలో 7వ దశ అక్షరాస్యత కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ మనిషిని మనిషిగా నిలిపేది విద్యేనని చెప్పారు. అక్షరాస్యత శాతంలో స్త్రీ, పురుషుల మధ్య వ్యత్యాసం లేకుండా చూడాలని పేర్కొన్నారు. డీఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ చంద్రశేఖరరాజు మాట్లాడుతూ జిల్లాలో ప్రతి ఒక్కరూ, అక్షర జ్ఞానం లేని ఒక్కొక్కరిని దత్తత తీసుకుని సంపూర్ణ అక్షరాస్యత సాధించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. జెడ్పీ సీఈవో దామోదర నాయుడు మాట్లాడుతూ కవులు, కళాకారులు, మేధావులకు పుట్టినిల్లయిన ఆంధ్రప్రదేశ్ అక్షరాస్యతలో వెనుకబడి ఉండటం దురదృష్టకరమని పేర్కొన్నారు. వయోజన విద్య ఉపసంచాలకురాలు శారద మాట్లాడుతూ జిల్లాలో ఆరు మండలాల్లో 7వ దశ అక్షరాస్యత కార్యక్రమాన్ని ప్రారంభించామని చెప్పారు. అనంతరం వయోజన విద్యకు ఎంపికైన వయోజనులకు పుస్తకాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో అర్బన్ కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రాజెక్టు ఆఫీసర్ సత్యనారాయణ, వయోజన విద్య పర్యవేక్షకులు దొరబాబు, ఎండీ హజ్‌బేగ్, ఎం.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.