ఆ పెళ్లికి జయ ఖర్చు.. 3 కోట్లు!
తన పెంపుడు కొడుకు వీఎన్ సుధాకరన్ పెళ్లికి అప్పట్లో జయలలిత పెట్టిన ఖర్చు దాదాపు మూడు కోట్ల రూపాయలని బెంగళూరులోని సీబీఐ ప్రత్యేక కోర్టు తేల్చిచెప్పింది. ఇప్పుడంటే మూడు కోట్లు పెద్ద మొత్తం కాకపోవచ్చు గానీ... ఆ పెళ్లి జరిగింది 1995లో! అప్పట్లో జరిగిన పెళ్లిళ్లు అన్నింటిలోకీ చాలా విలాసవంతమైన పెళ్లిగా దాన్ని అందరూ చెప్పుకొన్నారు. వాస్తవానికి అప్పటికి, ఇప్పటికి డబ్బు విలువలో తేడా దాదాపు పది నుంచి ఇరవై రెట్ల వరకు ఉంది. అంటే.. అప్పటి పది రూపాయలు ఇప్పుడు 200 రూపాయలతో సమానం, లేదా అంతకంటే కూడా ఎక్కువే. నాడు ముఖ్యమంత్రిగా ఉన్న జయలలిత అలాంటి సమయంలో మూడుకోట్లు వెచ్చించడం తీవ్ర వివాదానికి కారణమైంది.
తాంబూలం దగ్గర నుంచి అతిథులకు ఇచ్చిన విలువైన బహుమతుల వరకు అన్నీ ఆనాటి ఖర్చును తెలియజేశాయని, మూడు కోట్ల లెక్క కూడా అన్నింటినీ పరిగణనలోకి తీసుకునే చేశారని సీబీఐ ప్రత్యేక కోర్టు జడ్జి జాన్ మైఖేల్ డికున్హా తెలిపారు. ఈ కేసులో ఎ-1 నిందితురాలైన జయలలిత, ఎ-3 నిందితుడైన సుధాకరన్ పెళ్లి కోసం ఈ ఖర్చు చేశారని ఆయన అన్నారు. అయితే పె్లి కూతురి కుటుంబమే ఈ ఖర్చంతటినీ భరించిందని నిందితులు చెప్పడాన్ని ఆయన తిరస్కరించారు. ఈ పెళ్లికి చాలామంది వీఐపీలను పిలిచి, వాళ్లకు హోటళ్లలో బస ఏర్పాటుచేశారని, ఆ ఖర్చులన్నింటినీ జయలలితే భరించారని అన్నారు. పెళ్లిలో మండపం ఖర్చే దాదాపు రూ. 5.21 కోట్లు అయ్యిందని ప్రాసిక్యూషన్ వాదించింది.