ఆత్మహత్యలకు కారణాలు అన్వేషించండి
బెంగళూరు: రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న రైతుల ఆత్మహత్యలకు కారణాలు అన్వేషించాలని వివిధ విభాగాలకు సంబంధించిన అధికారులకు ఆదేశించినట్లు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తెలిపారు. బెళగావిలోని ఎస్.నిజలింగప్ప చక్కెర పరిశోధన కేంద్రాన్ని సందర్శించిన అనంతరం స్థానిక మీడియాతో ఆయన బుధవారం మాట్లాడారు.
జూన్ నెలలో 30 మంది రైతులు బలవన్మరణాలకు పాల్పడటం తనను తీవ్రంగా కలిచి వేస్తోందన్నారు. ఇందుకు సంబంధించిన సమగ్ర నివేదిక ఇవ్వాల్సిందిగా సంబంధిత అధికారులకు సూచించానన్నారు. కాగా, 36 మంది రైతుల బలవన్మరణాలు సంబవించాయని కేపీసీసీ అధ్యక్షుడు పరమేశ్వర్ చెబుతుండగా మీరు 30 మంది అని చెబుతున్నారు కదా? అన్న మీడియా ప్రశ్నకు ఈ విషయమై ఇంత కంటే ఎక్కువ మాట్లాడేది ఏమీ లేదంటూ అక్కడి నుంచి సీఎం సిద్ధరామయ్య వడివడిగా వెళ్లిపోయారు.