తరగని ఉద్యమ స్ఫూర్తి
=ఎన్జీవోలు సమ్మె విరమించినా కొనసాగిన సమైక్య పోరు
=వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ఆందోళనలు
=ఉద్యమంలోనే వివిధ వర్గాలు
అదే స్ఫూర్తి.. సమైక్యాంధ్ర ఆకాంక్ష.. జిల్లాలో కొనసాగుతోంది. ఎన్జీవోలు సమ్మె విరమించి విధుల్లోకి వెళ్లినా వివిధ వర్గాల ప్రజలు, వైఎస్సార్ సీపీ నేతలు, కార్యకర్తలు నిరసన కార్యక్రమాలు కొనసాగించారు. నూజివీడులో, కైకలూరులో విద్యార్థులు భారీ స్థాయిలో మానవహారాలు నిర్మించారు. విభజన నిర్ణయం వెనక్కి తీసుకోవాలని నినాదాలు చేశారు.
సాక్షి, విజయవాడ : ఏపీ ఎన్జీవోలు సమ్మె విరమించినా జిల్లాలో సమైక్య ఉద్యమ స్ఫూర్తి తగ్గలేదు. జిల్లా వ్యాప్తంగా సమైక్య ఆందోళనలు కొనసాగాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, వివిధ వర్గాల ప్రజల ఆధ్వర్యంలో జిల్లాలో పలు ప్రాంతాలలో నిరసన కార్యక్రమాలు జరిగాయి. సమైక్య సమ్మె ఆపేది లేదని వైద్యులు స్పష్టం చేశారు. ప్రభుత్వాస్పత్రిలో అవుట్ పేషెంట్ల సేవలతో పాటు, ఆపరేషన్లు, వైద్య విద్యార్థులకు బోధనా తరగతులను శుక్రవారం కూడా బహిష్కరించారు. ఆపరేషన్లు సైతం నిలిచిపోవడంతో పోస్ట్ ఆపరేటివ్ వార్డుతో పాటు, ఐసీయూలు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. మినిస్టీరియల్ సిబ్బంది మాత్రం విధుల్లో చేరారు.
గుడివాడ నెహ్రూచౌక్ సెంటర్లో జేఏసీ ఆధ్వర్యంలో దీక్షలు కొనసాగుతున్నాయి. కలిదిండి సెంటరులో ఇందిరా కాలనీకి చెందిన మహిళలు రిలే దీక్షలో చేపట్టారు. కలిదిండి సెంటరులో ఆంటోనీ దిష్టిబొమ్మను దహనం చేసి సోనియా, పురందేశ్వరి డౌన్‌డౌన్ అంటూ నినాదాలు చేశారు. వివేకానంద, సుగుణ జూనియర్ కళాశాల విద్యార్థులు మానవాహారం నిర్వహించారు. కైకలూరు తాలూకా సెంటర్లో జేఏసీ ఆధ్వర్యంలో దీక్షలు 66వ రోజుకు చేరాయి. రిటైర్డు ఉద్యోగులు రిలే దీక్షల్లో కూర్చున్నారు.
మండవల్లిలో కానుకొల్లు గ్రామస్తులు రిలే దీక్షల్లో పాల్గొన్నారు. ముదినేపల్లిలో మండల జేఏసీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న దీక్షలు 33వ రోజుకు చేరాయి. ఉయ్యూరు సెంటర్లో విద్యార్థులు, జేఏసీ నాయకులు నల్ల జెండాలతో నిరసన ప్రదర్శన చేపట్టి, ధర్నా నిర్వహించారు. పెడనలో విజయానంద డిగ్రీ కళాశాల విద్యార్థులు, మున్సిపల్ శానిటరీ వర్కర్లు ఒకరోజు రిలే నిరాహార దీక్ష చేపట్టారు.
నూజివీడులో పోరు ఉధృతం
నూజివీడులో రాజకీయేతర జేఏసీ నాయకులు సమైక్య పోరు ఉధృతం చేశారు. చిన్నగాంధీబొమ్మ సెంటరులో నిర్వహిస్తున్న రిలేదీక్షల శిబిరం యథావిధిగా కొనసాగింది. జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దీక్షలు 72వ రోజుకు చేరాయి. ముఠావర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో హమాలీలు ఈ దీక్షలో కూర్చున్నారు. శారదా విద్యాసంస్థల, కళాశాల విద్యార్థులు పట్టణంలో ర్యాలీ నిర్వహించి చిన్నగాంధీబొమ్మ సెంటరులో నిరసన ప్రదర్శన జరిపారు. విజయవాడలో తెలుగుదేశం నేతలు ఎన్టీఆర్ సర్కిల్ వద్ద క్షవరం చేస్తూ నిరసన, రాస్తారోకో చేశారు. జగ్గయ్యపేట పట్టణంలో జేఏసీ ఆధ్వర్యంలో రిలే దీక్షలు జరిగాయి.
ఇందులో టీడీపీ ఎస్టీ సెల్ నాయకులు పాల్గొన్నారు. చల్లపల్లిలో జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన దీక్షలు 70వ రోజుకు చేరాయి. మండల పరిధిలోని చింతలమడకు చెందిన రైతులు దీక్షలు చేశారు. కోడూరులో బాలభాను జూనియర్ కళాశాల విద్యార్థులు దీక్ష చేపట్టారు. నాగాయలంకలో జేఏసీ, లయన్స్‌క్లబ్ ఆధ్వర్యంలో సీఐటీయూ, ట్రాక్టర్ మెకానిక్ సంఘం నాయకులు దీక్షలో కూర్చున్నారు. అవనిగడ్డలో జేఏసీ ఆధ్వర్యంలో స్థానిక ఇండోర్ స్టేడియం వద్ద నిర్వహిస్తున్న రిలే దీక్షలు శుక్రవారం నాటికి 58వ రోజుకు చేరుకున్నాయి. ఈ దీక్షల్లో ఏకలవ్య సంఘ నాయకులు పాల్గొన్నారు.
టెలిఫోన్ నగర్ కాలనీలోని సమైక్యాంధ్ర జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్న రిలేదీక్షలు శుక్రవారంతో 48వ రోజుకు చేరుకున్నాయి. దీక్షలో శంకరంపాడు గ్రామానికి చెందిన రైతులు కూర్చున్నారు. విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో హనుమాన్‌జంక్షన్‌లో శుక్రవారం కేంద్ర ప్రభుత్వ రంగ కార్యాలయాల బంద్ నిర్వహించారు. బ్యాంకులు, పోస్టాఫీసు, టెలిఫోన్ ఎక్ఛేంజీలను విద్యార్థులు మూయించారు.
కైకలూరు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద సమన్వయకర్త దూలం నాగేశ్వరరావు ఆధ్వర్యంలో కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలు 73వ రోజుకు చేరాయి. పట్టణానికి చెందిన మహిళా కార్యకర్తలు 20 మంది రిలే దీక్షల్లో కూర్చున్నారు. ముదినేపల్లి మండల సమైక్యాంధ్ర పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలే దీక్షలు 33వ రోజుకు చేరాయి. ముదినేపల్లికి చెందిన మహిళలు దీక్షలో కూర్చున్నారు.