ప్రజలను మభ్యపెడుతున్న ప్రభుత్వం
టీడీపీ జిల్లా అధ్యక్షుడు విజయరమణారావు
ఎలిగేడు: ప్రజలను, రైతులను మభ్యపెడుతూ టీఆర్ఎస్ సర్కారు పబ్బం గడుపుతోందని టీడీపీ జిల్లా అధ్యక్షుడు సీహెచ్.విజయరమణారావు అన్నారు. మండలంలోని సుల్తాన్‌పూర్‌లో నీళ్లు లేక ఎండిపోతున్న వరినార్లు, నాటువేసిన పొలాలను బుధవారం పరిశీలించారు. పెద్దపల్లి నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో డీ–83, డీ–86 ద్వారా 1.20లక్షల ఎకరాలు సాగవుతున్నాయన్నారు. రెండేళ్లుగా వర్షాలు పడక బావులు, బోర్‌వెల్స్ కోసం దాదాపు రూ.500కోట్లు వరకు ప్రజలు ఖర్చు చేశారన్నారు. ఈ ఏడాది ఎస్సారెస్పీలో 51 టీఎంసీల నీళ్లు ఉన్నందున వారబంధీగా నీళ్లు వదులుతామన్న అధికారులు ఇప్పటి వరకు 500 క్యూసెక్కులు కూడా రాలేవన్నారు. వారబంధీపై ఆధారపడి సాగుచేసుకున్నా పొలాలు ఎండిపోతున్నాయన్నారు. డీ–83ద్వారా 1400 క్యూసెక్కులు, డీ–86ద్వారా 950 క్యూసెక్కులు 15 రోజులపాటు వదలాలని కోరారు. ఎల్లంపల్లి, డ్యాం నీరు మెదక్‌కు తీసుకెళ్లేందుకు సీఎం కేసీఆర్ కుట్ర చేస్తున్నారన్నారు. సింగిల్‌విండో చైర్మన్ నరహరి సుధాకర్‌రెడ్డి, టీడీపీ నాయకులు కొండ తిరుపతిగౌడ్, గోపు విజయభాస్కర్‌రెడ్డి, కోరుకంటి సంపత్‌రావు, అర్షనపల్లి వెంకటేశ్వర్రావు, పల్లె సత్యనారాయణరావు, వడ్లకొండ మోహన్ పాల్గొన్నారు.