మళ్లీ థర్మల్ సెగ
పోలాకి:ప్రశాంతంగా వున్న పోలాకి మండలంలో థర్మల్సెగలు రాజుకుంటున్నాయి. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో మండల ప్రజలు మండిపడుతున్నారు. జపాన్‌కు చెందిన సుమిటెమో కంపెనీ నిర్మించ తలపెట్టిన నాలుగువేల మెగావాట్ల సామర్థ్యం గల ఆల్ట్రామెగా సూపర్‌క్రిటికల్ థర్మల్ పవర్‌ప్లాంట్‌పై గతంలో స్థానికుల నుంచి తీవ్రవ్యతిరేకత వ్యక్తమైంది. దీనిపై మండలకేంద్రంలో భారీర్యాలీలు నిర్వహించారు. అధికారులు, నాయకులకు వినతిపత్రాలు కూడా అక్కడి ప్రజలు, పలు రాజకీయపార్టీలు, ప్రజాసంఘాల నాయకులు అందజేశారు. తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్లాంటు నిర్మాణంపై ఆ కంపెనీ యాజమాన్యంతో చర్చలు జరిపి అనుకూలమైన నిర్ణయాలు తీసుకున్నట్లు వచ్చిన వార్తల నేపథ్యంలో ప్రతిపాదిత గ్రామాల్లో ప్రజలు మళ్లీ ఆందోళనలో పడ్డారు.
కొన్నాళ్లుగా ప్రశాంతంగా వున్న ప్లాంట్ నిర్మాణం ఇక తప్పదన్నట్లు సంకేతాలు స్పష్టంగా రావటంతో మళ్ళీ థర్మల్ వ్యతిరేక ఉద్యమం పోలాకి మండలంలో పెద్ద ఎత్తున రాజుకోనున్నట్లు కన్పిస్తోంది. ఇప్పటికే ప్రతిపాదిత గ్రామాలైన తోటాడ, చీడివలస, కొండలక్కివలస, గంగివలస, సన్యాసిరాజుపేట, ఓదిపాడు, గవరంపేట, చెల్లాయివలస, దీర్ఘాశి, కుసుమపోలవలస, కోరాడలచ్చయ్యపేటల్లో దాదాపు 2500 ఎకరాల భూములు గుర్తించి రెవెన్యూ అధికారుల ద్వారా ప్రభుత్వానికి నివేదికలు పంపినట్లు సమాచారం. ఇదే జరిగితే అక్కడ సారవంతమైన భూములు రైతులు కోల్పోవ టంతో పాటు, పర్యావరణానికి తీవ్రనష్టం వాటిల్లుతుందని పలువురు పర్యావరణ ప్రేమికుల వాదన.
దీనిపై అప్పట్లో స్థల పరిశీలనకు వచ్చిన జపాన్ బృందం ఆ తరువాత అక్కడ ప్రాథమిక సర్వే ద్వారా నేలస్వభావాన్ని తెలుసుకునే ప్రయత్నం చేసింది. ఈ నేపధ్యంలో ఈ ప్రాంతానికి వచ్చి ఏపీ జెన్కో అధికారులను ప్రజలు అడ్డుకున్నారు. అక్కడినుంచి వారిని వెళ్లగొట్టి తమవ్యతిరేకతను స్పష్టపరిచారు. ప్రధాన ప్రతిపక్షం వైఎస్సార్సీపీతో పాటు, సీపీఐ, సీపీఎం తదితర అన్ని రాజకీయ పార్టీలు అక్కడి ప్రజలకు అండగా నిలిచాయి. తాజాగా మళ్లీ తెరపైకి వచ్చిన థర్మల్ ప్రతిపాదనపై అక్కడి ప్రజలు, నాయకులు ఏవిధంగా తమ అభిప్రాయాలు వ్యక్తపరచనున్నారో అన్నది సర్వత్రా చర్చనీయాంశమైంది.