ఆ చిత్రంలో ఆమె ఎక్కడ?
నటిగా పేరు తెచ్చుకోవాలంటే అసాంతం చిత్రంలో కనిపిస్తూ పెద్ద పెద్ద సంభాషణలతో ఆవేశపడి పోనవసరం లేదు. కనిపించిన ఒక సన్నివేశంలో అయినా పాత్ర స్వభావానికి తగ్గట్టుగా చిన్న అభినయం కనబరిస్తే చాలు అదృష్టం వరించేస్తుంది. నటి ప్రయోగను ఉదాహరణగా తీసుకోండి. ఆమె ఎవరు అంటారా? పిశాచు చిత్రం చూసిన వారికి ప్రయోగ ఎవరన్న విషయం వివరించనక్కరలేదు. ఆ చిత్రంలో ఆమె ఎక్కడున్నారు? అంటారా? సరిగ్గా గమనిస్తే ఆచిత్రంలో ఒక్క సన్నివేశంలో కనిపించిన ప్రయోగ గుర్తుకొస్తుంది.
ఆ సన్నివేశంలో నటించిన ప్రయోగ తదుపరి చిత్రంలో హీరోయిన్ అయిపోయారు. పోడా ఆండవనే ఎన్ పక్కం (పోరా దేవుడే నా పక్క) అన్న మన సూపర్‌స్టార్ రజనీకాంత్ డైలాగ్ గుర్తు కొచ్చిందా? అదే డైలాగ్ ఇప్పుడు సినిమా టైటిల్‌గా మారనుంది. దర్శకుడు ఆర్.కన్నన్ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రంలో విష్ణు హీరో. పిశాచు చిత్రంలో ఒక్క సన్నివేశంలో మెరిసిన ప్రయోగకు అదృష్టం తన పక్కనుండటంతో ఈ చిత్రంలో హీరోయిన్గా అవకాశం పొందేసింది.
ఈమెనీ చిత్రంలో హీరోయిన్గా ఎంపిక చేయడానికి పిశాచు చిత్రంలో ఆమె ప్లరేనా చెంపపై కొట్టిన సన్నివేశంలో చూసిన హావభావాలే కారణం అంటున్నారు దర్శకుడు ఆర్.కన్నన్. లవ్, కామెడీ, యాక్షన్ అంశాల్లో కలగలిపిన పోడా ఆండవనే ఎన్ పక్కం చిత్ర షూటింగ్ మే నుంచి మొదలవుతుందని దర్శకుడు తెలిపారు. ఈ చిత్రం కోసం చెన్నైలోని రిచ్ వీధి లాంటి బ్రహ్మాండమైన సెట్‌ను రూపొందిస్తున్నట్లు తెలిపారు. ముత్తయ్య ఛాయాగ్రహణం అందించనున్న ఈ చిత్రాన్ని 50 రోజుల్లో పూర్తి చేసి సెప్టెంబర్‌లో తెరపైకి తీసుకురావాలని ప్రణాళిక సిద్ధం చేసినట్లు దర్శకుడు చెప్పారు.