supro
-
రెండు ఇంధనాలతో మహీంద్రా వాహనాలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా రెండు రకాల ఇంధనాలతో నడిచే వాహన విభాగంలోకి ప్రవేశించింది. సుప్రో సీఎన్జీ డువో పేరుతో మోడల్‌ను విడుదల చేసింది. ధర ఢిల్లీ ఎక్స్‌షోరూంలో రూ.6.32 లక్షలు. ఈ తేలికపాటి వాణిజ్య వాహనం సీఎన్జీ, పెట్రోల్‌తో నడుస్తుంది. 750 కిలోల బరువు మోయగలదు. 75 లీటర్ల సీఎన్జీ ట్యాంక్, 5 లీటర్ల పెట్రోల్ ట్యాంక్ ఏర్పాటు చేశారు. పూర్తి స్థాయి సామర్థ్యంతో 325 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. మైలేజీ కిలోకు 23.35 కిలోమీటర్లు ఇస్తుందని కంపెనీ తెలిపింది. ‘సీఎన్జీ వాహనాల డిమాండ్ నాలుగేళ్లలో నాలుగురెట్లు పెరిగింది. సీఎన్జీ అవసరాన్ని ఇది సూచిస్తుంది. దేశవ్యాప్తంగా 2 టన్నులలోపు సామర్థ్యం గల తేలికపాటి వాణిజ్య వాహనాల అమ్మకాలు నెలకు 16,000 యూనిట్లు. ఇందులో సీఎన్జీ వాటా సుమారు 5,000 యూనిట్లు’ అని మహీంద్రా వైస్ ప్రెసిడెంట్ బానేశ్వర్ బెనర్జీ ఈ సందర్భంగా తెలిపారు. సుప్రో సీఎన్జీ డువో రాకతో నెలవారీ అమ్మకాలు రెండింతలు అవుతాయని సంస్థ భావిస్తోంది. 1.5తోపాటు 2 టన్నుల విభాగంలోనూ రెండు రకాల ఇంధనాలతో నడిచే మోడళ్లను తేనున్నట్టు వెల్లడించింది. -
సుప్రో బ్రాండ్‌తో 7 కొత్త వాహనాలు: మహీంద్రా
న్యూఢిల్లీ: దేశీ దిగ్గజ వాహన కంపెనీ ‘మహీంద్రా’ తాజాగా తన ‘సుప్రో’ బ్రాండ్ కింద ఏడు కొత్త వాహనాలను మార్కెట్లోకి తీసుకువచ్చింది. వీటిల్లో నాలుగు వెహికల్స్ ప్యాసెంజర్ వ్యాన్ విభాగానికి, మూడు వెహికల్స్ లోడ్ కారియర్ విభాగానికి చెందినవి ఉన్నాయి. సుప్రో మిని వ్యాన్ ప్రారంభ ధర రూ.4.71 లక్షలుగా, సుప్రో మిని ట్రక్ ప్రారంభ ధర రూ.4.28 లక్షలుగా ఉంది. ధరలన్నీ ఎక్స్‌షోరూమ్ కోల్కతావి. సుప్రో మిని వ్యాన్, సుప్రో మిని వ్యాన్ వీఎక్స్, సుప్రో మిని వ్యాన్ సీఎన్జీ, సుప్రో స్కూల్ వ్యాన్ అనేవి ప్యాసెంజర్ వ్యాన్ విభాగంలోని వాహనాలు. ఇక లోడ్ కారియర్లో సుప్రో మిని ట్రక్, సుప్రో మిని ట్రక్ సీఎన్జీ, సుప్రో కార్గో వ్యాన్ అనే వెహికల్స్ ఉన్నాయి. ఈ వాహనాలన్నీ బీఎస్–4 నిబంధనలకు అనువుగా తయారయ్యాయి.