కొనసాగుతున్న పోరాటం
భివండీ, న్యూస్‌లైన్: పెంచిన విద్యుత్ చార్జీలను ఉపసంహరించుకోవడం తదితర డిమాండ్లతో భివండీ మరమగ్గాల యజమానులు చేపట్టిన బంద్ శనివారంతో 11వ రోజుకు చేరుకుంది. నిరవధిక బంద్‌తో జనజీవనం అస్తవ్యస్తమవుతోంది. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించడం లేదని యజమానులు, కార్మికులు, స్థానిక నాయకులు మండిపడుతున్నారు. అందుకే బంద్‌ను ఈ నెల 20 వరకు పొడగిస్తున్నట్లు ప్రకటించారు. గత పది రోజుల నుంచి రాస్తారోకోలు, ఆందోళనలు, ధర్నాలు చేస్తున్నా ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవడం దారుణమని భివండీ పవర్ సంఘర్ష్ సమితి అధ్యక్షుడు, ఎంపీ సురేష్ ఠావురే అన్నారు. తదుపరి కార్యాచరణపై చర్చించడానికి ఆయన సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్యే ర షీద్ తాహిర్, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు సోహెబ్ గుడ్డూ తదితరులతో సమావేశం నిర్వహించారు. ఈ నెల 15 వరకు నిర్వహించాల్సిన బంద్‌ను 20 వరకు పొడగించాలని ఈ సందర్భంగా నిర్ణయించారు. అయినప్పటికీ ప్రభుత్వం స్పందించకపోతే భివండీలోని ఆనంద్దిగే చౌక్ నుంచి ముంబై మంత్రాలయం వరకు ర్యాలీ నిర్వహిస్తామని సురేష్ ఠావురే ప్రకటించారు.
నాయకులు అసమర్థులు...
భివండీలో రాజకీయ నాయకులు చిత్తశుద్ధితో వ్యవహరిస్తే సమస్య పరిష్కారమవుతుంది. వారి అసమర్థత వల్లే ప్రభుత్వమూ పట్టించుకోవడం లేదు. బీజేపీ, శివసేన, సమాజ్‌వాదీ పార్టీలకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు, అధికార పార్టీ ఎంపీ కూడా ఆందోళనల్లో పాల్గొంటున్నారు. అయితే మా సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు వీళ్లు ఎందుకు విఫలమవుతున్నారో అర్థం కావడం లేదు.
- వడ్డెపల్లి శ్రీనివాస్ (టెక్స్టైల్ డిజైన్ మాస్టర్)
మిలాఖత్ వల్లే...
కొందరు విలేకరులు, పోలీసులు టోరెంట్ పవర్ కంపెనీతో చేతులు కలుపుతున్నారు. అందుకే విద్యుత్ చార్జీలు పెంచినా ఎవరూ ఏమీ అనడం లేదు. వస్త్రపరిశ్రమలు సంక్షోభంలో చిక్కుకుంటున్నాయి. ఎంఎస్ఈబీ విద్యుత్ సరఫరా చేస్తున్న సమయంలో పోలీసులతోపాటు విలేకరులు ఏదైనా అన్యాయం జరిగితే ప్రజలకు అండగా నిలిచేవారు. ఇప్పడు వారు టోరెంట్ కంపెనీకే సహకరిస్తున్నట్టు అనిపిస్తోంది. -వాసం రాజేందర్ (నేత కార్మికుడు)