కల సాకారమమ్యే నాటికి తానే కలగా మిగిలింది..
గోకవరం : ప్రభుత్వ ఉద్యోగం కోసం కలలుగన్న ఓ యువతి.. దాన్ని సాకారం చేసుకోవడానికి అహర్నిశలు శ్రమించింది. తీరా ఆ ఉద్యోగం వచ్చేసరికి తానే ఓ కలగా మిగిలిపోయింది. తల్లిదండ్రుల కథనం ప్రకారం.. తూర్పు గోదావరి జిల్లా గోకవరం గ్రామానికి చెందిన బళ్ల స్వాతి (20) అగ్రికల్చర్ పాలిటెక్నిక్ చదివి ఇటీవల వ్యవసాయ శాఖలో బహుళార్థక విస్తరణాధికారి (ఎంపీఈఓ) పోస్టు కోసం జరిగిన ఇంటర్వ్యూకు హాజరైంది.
అయితే ఆమెను గత కొంత కాలంగా అదే గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు వేధించ సాగారు. ఆ క్రమంలో ఈ వేధింపులు తాళలేక గత ఏడాది డిసెంబర్ 15వ తేదీన స్వాతి పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు వద్ద గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. దీంతో స్వాతి తల్లిదండ్రులు తిరుపతి, పాపమ్మ .. సదరు యువకుల వేధింపుల కారణంగానే తన కుమార్తె ఆత్మహత్య చేసుకుందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో గోకవరం పోలీసులు నిందితులను అరెస్టు చేసి రిమాండుకు తరలించారు.
కాగా స్వాతికి ఉద్యోగం వచ్చిందంటూ వ్యవసాయ అధికారుల నుంచి మంగళవారం ఆమె తల్లిదండ్రులకు ఫోను వచ్చింది. దీంతో మరణించిన కుమార్తెను తలచుకుని తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. ఈ ఉద్యోగం కోసం స్వాతి రేయింబవళ్లు కష్టపడి చదివిందని, ఉద్యోగం వచ్చిన తరువాత కష్టం తెలియకుండా తమను చూసుకుంటానని చెప్పిందని.... అలాంటింది ఇప్పుడా ఉద్యోగం వచ్చిన వేళ.. తమ చిట్టితల్లి తమకు దక్కకుండా పోయిందని బోరున తిరుపతి, పాపమ్మ విలపించారు.