కాన్సస్‌లో ఉగాది వేడుకలు
కాన్సస్ : అమెరికాలోని కాన్సస్ సిటీలో తెలుగు అసొసియేషన్ ఆఫ్ గ్రేటర్ కాన్సస్ సిటీ(టీఏజీకేసీ) ఆధ్వర్యంలో శ్రీ విళంభి నామ సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. ఓవర్ ల్యాండ్ పార్క్‌లోని బ్లూ వ్యాలీ నార్త్ వెస్ట్ హై స్కూల్లో జరిగిన ఈ వేడుకల్లో దాదాపు 800 మందికి పైగా తెలుగు వాళ్లు పాల్గొన్నారు. దేవాలయ పూజారి శ్రీనివాసాచార్యులు పంచాంగ శ్రవణం చేశారు. ప్రొగ్రామ్ కమిటీ ఛైర్ విశేషు రేపల్లె అతిథులందరికి ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. శ్రావణి మేక, దీప్తి జొన్నలగడ్డలు వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు.
పిల్లలు ప్రదర్శించిన శాస్త్రీయ, సినిమా పాటల నృత్యాలు అందరిని ఆకట్టుకున్నాయి. టీఏజీకేసీ అధ్యక్షులు సురేష్ గుండు తన కార్యవర్గ సభ్యులను పాట ద్వారా వేడుకపైకి ఆహ్వానించారు. తెలుగు సాహితి, సంస్కృతిలను కాపాడుతూ, ముందు తరాలవారికి అందించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని సురేష్ పేర్కొన్నారు. మానవ సేవే మాధవ సేవ కనుక ఎవరికి తోచిన విధంగా ఇతరులకు సహాయం చేయాలని కోరారు. టీఏజీకేసీ ట్రస్ట్ బోర్డ్ ఛైర్ శిరీష మంచెల్ల ట్రస్ట్ బోర్డ్ కార్యవర్గాన్ని అందరికి పరిచయం చేశారు. ఎన్నో సంవత్సరాలుగా తెలుగు సంఘానికి సేవలు చేసిన వారికి జ్ఞాపికలు అందజేశారు. ఈ ఏడాది ఆరంభంలో జరిగిన ముగ్గులపోటీలు, చెస్, క్యారం బోర్డ్ పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. ఉపాధ్యక్షులు శివ తియాగుర కార్యక్రమ విజయానికి సహాయం అందించిన అందరికి ధన్యవాదాలు తెలిపారు.