రాజ్యసభ సీటా... నాకొద్దుబాబు
ఎన్నికల్లో పార్టీ తరఫున లోక్సభ అభ్యర్థిగా నిలబడాలంటే ... అధిష్టానం మొప్పు పొందాలి. కరెన్సీ నోట్లు వెదజల్లాలి. ఇంకా మాట్లాడితే అదృష్టం కూడా కలసి రావాలి. నిద్రాహారాలు మాని ప్రచారం చేయాలి. ఇంత చేసి ఎన్నికల్లో గెలిస్తే ఓకే. ఓ వేళ ఓడిపోతే ఇంతే సంగతులు. ఈ కష్టం అంతా ఎందుకు రాజ్యసభ సీటు ఇస్తే ఏకంగా వెళ్లి పెద్దల సభలో కాలుమీద కాలు వేసుకుని కూర్చోవచ్చని పలువురు ఆశిస్తుంటారు. ఓ వేళ ఆ అవకాశం అదృష్టం కొద్ది తలుపు తడితే ఎవరైనా ఎగిరి గంతు వేస్తారు. కానీ ఓ పార్టీ అగ్ర నాయకత్వం మాత్రం కేబినెట్లోని మంత్రిగారి భార్యకు రాజ్యసభ సీటుని ఆఫర్ చేసింది. అయితే ఆ ఆఫర్ను సదరు మంత్రిగారి భార్య తొసిపుచ్చింది.
రాజ్యసభ సీటు ఆఫర్ చేసినందుకు ధన్యవాదాలు... కానీ రాజ్యసభ సీటు కంటే నా కుటుంబంతో గడపడమే నాకు అతి మఖ్యమని భావిస్తున్నానని ప్రకటించింది. దీంతో సదరు మంత్రిగారు భార్య నిర్ణయంతో పార్టీ అగ్రనాయకత్వం కంగుతింది. ఈ రోజుల్లో ఇలాంటి వాళ్లు కూడా ఉన్నారా అని అగ్ర నాయకత్వం ఆలోచనలో పడింది. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్లో చోటు చేసుకుంది. రాష్ట్రంలో సీఎం అఖిలేష్ యాదవ్ కేబినెట్లోని అజాంఖాన్ సీనియర్ మంత్రిగా పని చేస్తున్నారు. ఆయన భార్య తంజీమ్ ఫాతిమాకు సమాజ్వాదీ పార్టీ రాజ్యసభ సీటు ఇచ్చి పంపాలని నిర్ణయించింది. ఆ ఆఫర్ ఆజాంఖాన్ భార్య నిర్ద్వందంగా తోసి పుచ్చింది.