చెరువులు ఇలా.. సాగు ఎలా?
గజ్వేల్, న్యూస్‌లైన్: ఆయకట్టుదారుల భాగస్వామ్యంతో చెరువులను అభివృద్ధిచేయాలనే ప్రభుత్వ లక్ష్యం నీరుగారుతోంది. చెరువులకు కొత్త రూపు తీసుకొచ్చేందుకు నాలుగేళ్ల కిందట చేపట్టిన సామూహిక చెరువుల యాజమాన్య భాగస్వామ్య పథకానికి అధికారుల నిర్లక్ష్యం శాపంగా మారింది. కాంట్రాక్టర్లు చేపట్టిన పనుల్లో నాణ్యాతాలోపించడంతో ఎక్కడికక్కడ చెరువుకట్టలు దెబ్బతిని గండ్లు పడే ప్రమాదం నెలకొంది. ఫలితంగా సాగు, చెరువుల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది.
జిల్లాలోని 192 నీటిపారుదల శాఖ చెరువులను అభివృద్ధి చేసేందుకు సామూహిక భాగస్వామ్య యాజమాన్య పథకం ద్వారా అప్పటి ప్రభుత్వం 2008లో రూ. 42.80 కోట్ల నిధులను విడుదల చేసింది. గజ్వేల్ నియోజకవర్గంలోని గజ్వేల్, తూప్రాన్, ములుగు, వర్గల్, జగదేవ్‌పూర్, కొండపాక మండలాల్లోని 46 చెరువుల అభివృద్ధికి రూ. 9.92 కోట్లు మంజూరు చేశారు. 5 శాతం ఆయకట్టుదారుల శ్రమదానం, మరో 5 శాతం ఆయకట్టుదారుల వాటాతో నిధులు విడుదల చేశా రు. ఈ నిధులతో చెరువుల కట్టల ఎత్తు పెం పు, అలుగు, తూములు, కాల్వల నిర్మాణం తదితర పనులను చేపట్టడానికి నిర్ణయించారు. అభివృద్ధి పనుల్లో నాణ్యత లోపించడంతో ఆందోళన కలిగిస్తోంది. గజ్వేల్ నియోజకవర్గంలో ఇప్పటివరకు చేపట్టిన 46 చెరువు పనుల్లో నాణ్యత లోపించదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ధర్మారెడ్డిపల్లిలోని పల్లె చెరువు పనులు కూడా సక్రమంగా చేపట్టలేదు. కట్ట నిర్మాణం పటిష్టంగా జరగకపోవడం వల్ల రెండున్నరేళ్ల క్రితం నుంచే మట్టి తొలగిపోతూ భారీగా కోతలు ఏర్పడి గండ్లు పడే ప్రమాదం పొంచివుంది. ఈసారి వర్షాలు తక్కువగా కురవడంవల్ల చెరువులోకి పావు వంతు కూడా నీరు చేరలేదు. పూర్తిగా నిండి ఉంటే కట్ట తెగిపోయేదని చెరువు కింద ఉన్న 193 ఎకరాల ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు. ధర్మారెడ్డిపల్లి పల్లెచెరువే కాదు.. నియోజకవర్గంలో ఈ పథకం కింద చేపట్టిన అన్ని చెరువుల పనుల్లోనూ ఇదే రకమైన పరిస్థితి నెలకొంది.