ట్యాక్సీ యాప్@ 1.80 లక్షల కోట్లు!
సాక్షి ప్రత్యేక ప్రతినిధి: విస్తరిస్తున్న నగరాల్లో ప్రయాణికులను ఒక చోట నుండి వేరొక చోటికి చేరవేసే రవాణా సేవల్లో బిలియన్ డాలర్ల వ్యాపార అవకాశాలుండటంతో బహుళజాతి సంస్థలు వేల కోట్ల రూపాయలను ఈ రంగంలో కుమ్మరిస్తున్నాయి. టెక్నాలజీ ఆధారిత ట్యాక్సీ సేవల రంగంలో పెట్టుబడులకు మించి ఎన్నో రెట్లు ప్రతిఫలం వస్తుండటంతో ఇన్వెస్ట్మెంట్ సంస్థలు ఈ రంగంలో పెట్టుబడులకు ఉత్సాహం చూపిస్తున్నాయి. ఆయా సంస్థల విలువలను ఎవరికీ అందని అంచనాలతో అనూహ్య స్థాయిల్లో మదింపు చేస్తున్నారు.
స్థిరాస్తులు ఏమీ లేని అమెరికాకు చెందిన ఉబర్ సంస్థ విలువ 30 బిలియన్ డాలర్లు (లక్షా 80 వేల కోట్ల రూపాయలు) అంటే ముక్కున వేలేసుకోవల్సిందే. ఇండియాలో రూ. 2,400 కోట్లతో (400 మిలియన్డాలర్లు) వ్యాపారాభివృద్ధి చేసుకునేందుకు ఉబర్ ప్రణాళికలు సిద్ధం చేసింది. ట్యాక్సీ క్యాబ్ రంగంలో ఈ స్థాయి పెట్టుబడులు గతంలో ఎన్నడూ చూడలేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ ఉబర్ బిజినెస్ మోడల్ భిన్నమైనది. రేడియో క్యాబ్స్లా ఉబర్ సంస్థకు సొంతంగా ట్యాక్సీలు, క్యాబ్‌లు లేవు. వాటిని నడిపించే డ్రైవర్లూ దాని ఉద్యోగులు కాదు.
ఇది ఒక టెక్నాలజీ యాప్. అది చేసే పని కేవలం పేరయ్య (సర్వీస్ ఫెసిలిటేటర్) పనే. అంటే ట్యాక్సీ సేవలు కావాలనుకున్న కస్టమర్‌కు కారు డ్రైవర్ లేదా ఓనర్‌తో ఆన్లైన్లో అనుసంధానించటమే దీని పని. ఈ పనికి పొందే కమీషనే దీని ఆదాయం. దేశంలో హైదరాబాద్, బెంగళూరుతో ఆరు నగరాల్లో ఈ సంస్థ సేవలు వినియోగంలో ఉన్నాయి. ఉబర్ ఎక్స్ కార్ రెంటల్ కనీస చార్జీ రూ. 150. టాక్సీ మీటర్ రూ. 50 నుంచి మొదలవుతుంది. కిలోమీటర్‌కు రూ. 15 చార్జీ చేస్తారు.
నగదు చెల్లింపు ఎలా??
వినియోగదారుడు తొలుత ఉబర్ యాప్‌ను తన మొబైల్‌లోకి డౌన్లోడ్ చేసుకోవాలి. ట్యాక్సీ చార్జీలను డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్...ఇలా ఏ మార్గంలో చెల్లించాలనుకుంటే ఆ వివరాలను పేటిఎం వాలెట్ ద్వారా ఉబర్‌కు లింకప్ చేసుకోవాలి. పేటిఎం వాలెట్ ఆప్షన్ ప్రస్తుతం ఆండ్రాయిడ్, ఐఓఎస్( ఐఫోన్) ఆపరేటింగ్ సిస్టంలలో నడుస్తోంది. డబ్బు చెల్లించేందుకు ‘పేమెంట్’ బటన్ నొక్కాలి. తర్వాత ‘యాడ్ మనీ’ ని క్లిక్ చేయండి. వాలెట్లో రీచార్జి మొత్తం రూ. 100 కు తగ్గరాదు. ఇది మినిమం బ్యాలెన్స్. వాలెట్‌ను మన అవసరాలకు అనుగుణంగా క్రెడిట్, డెబిట్‌కార్డు లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా రీచార్జి చేసుకోవచ్చు.
డ్రైవర్లకు అధికాదాయం...
సంప్రదాయ ట్యాక్సీ డ్రైవర్లకన్నా ఉబర్ నెట్వర్క్ డ్రైవర్లు అధికాదాయం పొందుతున్నారు. సొంత కారు కలిగి ట్యాక్సీ నడపాలనుకున్న ఎవరైనా ఉబర్ డ్రైవర్ కావచ్చు. ఉబర్ ఎంపిక వడపోతలో మీరు అర్హులైతే మీకు సంస్థ ఒక ఐఫోన్ ఇస్తుంది. దాంతో మీరు ఉబర్ నెట్‌వర్క్‌లో సభ్యులైపోతారు. ఆయా నగరాలను బట్టి ట్యాక్సీఫేర్ (రవాణా చార్జీ)ని ఉబర్ సంస్థ నిర్ధారిస్తుంది. ఉబర్ సంస్థ వసూలు చేసిన చార్జీలో 20 శాతం తన కమీషన్‌గా తీసుకొని మిగిలిన 80 శాతం డ్రైవర్ ఖాతాకు జమ చేస్తుంది. సాధారణ ట్యాక్సీ సంస్థలకన్నా ఉబర్ ద్వారానే డ్రైవర్లు ఎక్కువ ఆదాయాన్ని పొందుతున్నారు. ఉబర్ చిన్నకార్ల డ్రైవర్లు వారానికి కనీసం రూ.16 వేలు సంపాదిస్తున్నారు.