ఇవేం బది‘లీలలు’
- కంప్లైంట్ బాక్స్‌పై ఉపాధ్యాయుల కంప్లైట్లు
- మధ్యాహ్నం వరకు ఆన్లైన్లో ఓపెన్ కాని కంప్లైంట్ బాక్స్
- తలలు పట్టుకున్న టీచర్లు
- సైన్స్ సెంటర్ చుట్టూ ప్రదక్షిణలు
- ముగిసిన అభ్యంతరాల గడువు
- కుప్పలు తెప్పలుగా పెండింగ్
అనంతపురం ఎడ్యుకేషన్ : ఉపాధ్యాయుల బదిలీల్లో ‘లీలలు’ చోటు చేసుకుంటున్నాయి. బదిలీల్లో భాగంగా తాత్కాలిక సీనియార్టీ జాబితాలు రాక ఓ వైపు ఆందోళన..పాయింట్లు పడక మరోవైపు ఉపాధ్యాయులు దిక్కులు చూస్తున్నారు. ఉదయం ఇంటి నుంచి పాఠశాల.. అక్కడి నుంచి నేరుగా జిల్లా కేంద్రంలోని సైన్స్ సెంటర్‌కు వెళ్లడం.. ఇదీ మెజార్టీ ఉపాధ్యాయులు రోజువారి దినచర్య. కుప్పలు తెప్పలుగా తప్పులు వస్తున్నాయి. వాటిని సరిదిద్ది పాయింట్లు నమోదు చేసే విషయంలో అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. షెడ్యూలు ప్రకారం అన్ని కేటగిరీల ఉపాధ్యాయులు తాత్కాలిక సీనియార్టీ జాబితా ఈనెల 18న ప్రకటించాల్సి ఉంది. తర్వాత రెండు రోజులు అంటే గురువారం వరకు వాటిపై అభ్యంతరాలు తెలియజేయాల్సి ఉంది. కానీ అభ్యంతరాల గడువు రోజు వరకు సీనియార్టీ జాబితాలు ఒక్కొక్కటిగా వస్తూనే ఉన్నాయి.
ఫిర్యాదు బాక్సు పనిచేయక అవస్థలు :
వాస్తవానికి అభ్యంతరాల స్వీకరణకు స్థానిక కేఎస్ఆర్ బాలికల పాఠశాలలో ఒకరోజు కేంద్రాలు ఏర్పాటు చేశారు. తర్వాత ఆన్లైన్లోనే ఫిర్యాదు చేయాలని చెప్పడంతో ఆ కేంద్రాలను ఎత్తేశారు. గురువారం ఉదయం నుంచి ఆన్లైన్లో కంప్లైంట్ బాక్స్ పని చేయడం లేదు. జిల్లా వ్యాప్తంగా వేలాదిమంది ఉపాధ్యాయులు తమ ఫిర్యాదులు నమోదు చేయడానికి అవస్థలు పడ్డారు. గురువారం ఒక్కరోజే గడువు ఉండడంతో అందరూ సైన్స్ సెంటర్‌కు పరుగులు పెట్టారు. అక్కడికి రాగానే డీఈఓ కార్యాలయ సిబ్బంది అభ్యంతరాలను తీసుకునేందుకు ససేమిరా అంగీకరించలేదు. ఏదైనా ఉంటే ఆన్లైన్లో ఫిర్యాదు చేయాలి తప్ప.. మ్యానువల్‌గా తీసుకునేదిలేదని తేల్చి చెప్పడంతో ఉపాధ్యాయులు తలలు పట్టుకున్నారు. మధ్యాహ్నం తర్వాత ఆన్లైన్ పని చేసినా సర్వర్ సాంకేతిక సమస్య కారణంగా ఆశించిన స్థాయిలో ఫిర్యాదులు చేయలేకపోయారు.
ఫిర్యాదు చేసేందుకు అవస్థలు :
ఉపాధ్యాయుడి ట్రెజరీ ఐడీ, పుట్టిన రోజు ఆధారంగా ఆన్లైన్లో ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది. అయితే ఇదివరకే ఇదే ఐడీ, పుట్టిన తేదీ ఆధారంగా ఏదైనా ఫిర్యాదు చేసి ఉంటే అది పరిష్కారం కాకుండా మరో ఫిర్యాదు స్వీకరించడం లేదు. అందులోనూ ఒక వ్యక్తి ఒక ఫిర్యాదు మాత్రమే చేయాలి తప్ప అంతకు మించి తీసుకోవడం లేదు.
స్పౌజ్ పాయింట్లు రద్దుకు రావాలని చెప్పి...
స్పౌజ్ పనిచేస్తున్న సమీపంలోకి వెళ్లాలనే నిబంధనను పక్కాగా అమలు చేస్తుండడంతో చాలా మందికి ఇబ్బందికరంగా మారుతోంది. స్పౌజ్ పాయింట్లు రద్దు చేసుకునేందుకు అనుమతివ్వకడంతో పలువురు ఉపాధ్యాయులు సైన్స్ సెంటర్‌కు చేరుకున్నారు. నేరుగా ఎంఈఓ, హెచ్ఎంలో ధ్రువీకరణ తీసుకొని వచ్చారు. అయితే వాటిని రద్దు చేసేందుకు విద్యాశాఖ అధికారులు ససేమిరా అంటూ వెనక్కు పంపారు. ఏదైనా ఉంటే నేరుగా ఆన్లైన్లో ఫిర్యాదు చేయాలి తప్ప మ్యానువల్‌గా చేయడం కుదరదని తేల్చి చెప్పడంతో వారంతా ఊసూరుమంటూ వెనుతిరిగారు.
పాయింట్లు రీజనరేట్ కాలేదు :
వందలాది మంది టీచర్లకు సంబంధించి వివిధ పాయింట్లు రీజనరేట్ కావడం లేదు. ఆధారాలతో సహా ధ్రువపత్రాలు ఇస్తున్నా...ఆన్లైన్లో నమోదు చేసినా కూడా పాయింట్లు మాత్రం పడడం లేదు. అగళి జెడ్పీహెచ్ఎస్లో పని చేస్తున్న నీలిమ అనే టీచర్‌కు మొత్తం 27.5787 పాయింట్లు వచ్చాయి. ఆన్లైన్లో మొత్తం తప్పుగా వచ్చి 25 పాయింట్లుగా నమోదయ్యింది. సీనియార్టీ జాబితాలో సుమారు 70 - 80 మంది వెనక్కి వెళ్లిపోయింది. ఈమె పలుమార్లు ఫిర్యాదు చేసి అధికారుల చుట్టూ తిరుగుతున్నా సమస్య పరిష్కారం కాలేదు. అలాగే కొత్తచెరువు మండలం పోతులకుంట జెడ్పీహెచ్ఎస్లో ఎల్పీటీగా సుగుణమ్మ పని చేస్తోంది. ఈమె స్వయంగా ఆర్జేడీకి సమీప బంధువు. ఈమె స్పౌజ్ కేటగిరికింద దరఖాస్తు చేసుకోవడంతో 37 పాయింట్లు వచ్చాయి. దరఖాస్తు ఎంఈఓ లాగిన్ నుంచి డీఈఓ లాగిన్‌కు వెళ్లగానే స్పౌజ్ పాయింట్లు తొలిగిపోయాయి. కేవలం 31 పాయింట్లు మాత్రమే నమోదయ్యాయి. ఈ విషయంపై ఫిర్యాదు చేసినా పరిష్కారం కాలేదు.