Technology Park
-
కొప్పర్తిలో మరో ‘టెక్నాలజీ’ పార్కు
సాక్షి, అమరావతి : రాష్ట్రంలోని సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలను చేయిపట్టి నడిపించేలా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక అడుగు ముందుకేసింది. ఎంఎస్ఎంఈలకు అవసరమైన నూతన సాంకేతిక పరిజ్ఞానం, నైపుణ్యం కలిగిన మానవ వనరులను అందించేలా కొత్తగా మరో ఎంఎస్ఎంఈ టెక్నాలజీ సెంటర్‌ను ఏర్పాటు చేస్తోంది. విశాఖలోని టెక్నాలజీ సెంటర్ లాగానే వైఎస్సార్ జిల్లా కొప్పర్తిలో మరో టెక్నాలజీ సెంటర్‌ను ఏర్పాటుకానుంది. సుమారు 20 ఎకరాల విస్తీర్ణంలో రూ.250 కోట్లతో దీనిని ఏర్పాటు చేస్తారు. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలకు కేంద్ర ఎంఎస్ఎంఈ శాఖ ఆమోదం తెలిపిందని రాష్ట్ర పరిశ్రమల శాఖ కమిషనర్ సీహెచ్ రాజేశ్వరరెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. వైఎస్సార్ జగనన్న మెగా ఇండస్ట్రియల్ హబ్‌లో కేంద్ర ప్రతినిధులు పరిశీలించిన సుమారు 19.5 ఎకరాల భూమిని కేటాయించాలి్సందిగా కోరుతూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డికి కేంద్ర అదనపు కార్యదర్శి రజనీష్ లేఖ రాశారు. విశాఖలో తయారీ రంగానికి సంబంధించిన పరిశ్రమలు అధికంగా ఉండటంతో జనరల్ ఇంజనీరింగ్ టెక్నాలజీ సెంటర్‌ను ఏర్పాటు చేశారని, అదే తరహాలో కొప్పర్తిలో వైఎస్సార్ ఈఎంసీ, వైఎస్సార్ జగనన్న మెగా ఇండస్ట్రియల్ హబ్ ఉండటంతో ఇక్కడ ఏర్పాటయ్యే పరిశ్రమలకు అనుగుణంగా టెక్నాలజీ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఈ టెక్నాలజీ సెంటర్‌ను వినియోగించుకునేలా సంబంధిత పరిశ్రమలతో ముందస్తుగా ఒప్పందాలు కుదుర్చుకుంటారు. దీనికి సంబంధించి త్వరలోనే అధ్యయనం చేసి ఏ విభాగానికి చెందిన టెక్నాలజీ సెంటర్ ఏర్పాటు చేయాలన్నదానిపై కేంద్రానికి ప్రతిపాదనలను పంపనున్నారు. ఈ టెక్నాలజీ సెంటర్లో అధునాతనమైన ల్యాబ్‌లతో పాటు నైపుణ్యం కలిగిన మానవ వనరులను అందించేలా దీర్ఘకాలిక, మధ్య కాలిక, స్వల్ప కాలిక కోర్సుల్లో విద్యార్థులకు శిక్షణ ఇస్తారు. శిక్షణ పూర్తి చేసుకున్న విద్యార్థులకు స్థానిక యూనిట్లలో ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. -
కాఫీడే టెక్ పార్క్ విక్రయానికి యస్ బ్యాంకు బ్రేక్!
బెంగళూరు: కాఫీడే ఎంటర్ప్రైజెస్ బెంగళూరులో తనకున్న టెక్నాలజీ పార్క్‌ను బ్లాక్‌స్టోన్ గ్రూపునకు విక్రయించేందుకు ఒప్పందం కుదుర్చుకోగా, దీనికి యస్ బ్యాంకు ఆమోదం చెప్పకపోవడంతో నిలిచిపోయినట్టు సమాచారం. కాఫీ డే గ్రూపునకు రుణాలిచ్చిన సంస్థల్లో యస్ బ్యాంకు కూడా ఒకటి. ఈ ఒప్పందానికి యస్ బ్యాంకు ఇప్పటి వరకు నిరభ్యంతర సర్టిఫికెట్ ఇవ్వలేదని ఈ వ్యవహారం గురించి తెలిసిన వర్గాలు చెప్పాయి. కాఫీ డే తీసుకున్న ఇతర రుణాల తాలూకు చెల్లింపులపై హామీ ఇవ్వాలని యస్ బ్యాంకు కోరినట్లు తెలిసింది. ఇతర రుణదాతలంతా ఇప్పటికే కాఫీడే టెక్ పార్క్– బ్లాక్‌స్టోన్ ఒప్పందానికి ఆమోదం తెలిపారని, యస్ బ్యాంకు మాత్రమే ఆమోదం తెలపాల్సి ఉందని ఆ వర్గాలు వెల్లడించాయి. కాఫీ డేకు చెందిన ట్యాంగ్లిన్ డెవలప్మెంట్స్ లిమిటెడ్ ఆధ్వర్యంలో బెంగళూరులో గ్లోబల్ విలేజ్ టెక్ పార్క్ నడుస్తోంది. ఈ కంపెనీ యస్ బ్యాంకుకు రూ.100 కోట్లు బకాయి పడింది. కాఫీ డే కూడా యస్ బ్యాంకుకు రూ.1,400 కోట్ల వరకు బకాయిలు చెల్లించాల్సి ఉంది. వ్యవస్థాపకుడు వీజీ సిద్ధార్థ ఆకస్మిక ఆత్మహత్య తర్వాత కంపెనీ యాజమాన్యం ఆస్తుల విక్రయం ద్వారా అప్పులు చెల్లించే ప్రయత్నాలు మొదలెట్టింది. ఇందులో భాగంగా గ్లోబల్ విలేజ్ టెక్ పార్క్‌ను బ్లాక్‌స్టోన్‌కు రూ.2,600– 3,000 కోట్ల విలువకు విక్రయించేందుకు నాన్ బైండింగ్ ఒప్పందం చేసుకుంది. తాజా పరిణామాలతో బీఎస్ఈలో కాఫీడే షేరు సోమవారం 9 శాతం నష్టంతో రూ.43.85 వద్ద క్లోజయింది. -
ఏపీలో ఫోర్త్ జనరేషన్ టెక్నాలజీ పార్కు
ప్రధాని మోదీ, మలేసియా ప్రధాని సమక్షంలో అవగాహన ఒప్పందం సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో ఫోర్త్ జనరేషన్ టెక్నాలజీ పార్కును ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం, మలేసియా ప్రభుత్వాల మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. శనివారం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో జరిగిన కార్యక్రమంలో ప్రధాని నరేంద్రమోదీ, మలేసియా ప్రధాని నజీబ్ రజాక్ల సమక్షంలో ఏపీ ఎకనమిక్ డెవలప్మెంట్ బోర్డు, మలేసియా ఇండస్ట్రీ గవర్నమెంట్ ఫర్ హై టెక్నాలజీ (మైట్)కు చెందిన ఎంటీఎన్ సంస్థ అధికారులు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. ఈ సందర్భంగా ఏపీ ఎకనమిక్ డెవలెప్మెంట్ బోర్డ్ సీఈవో కృష్ణకిశోర్ మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆహ్వానం మేరకు రాష్ట్రంలో ఫోర్త్ జనరేషన్ పార్కు ఏర్పాటు చేయడానికి మలేసియా ప్రభుత్వరంగ సంస్థ మందుకొచ్చిందని చెప్పారు. ఈ పార్కు ఏర్పాటులో భాగంగా మొదటి విడతలో రూ.400 కోట్ల పెట్టుబడులతో బియ్యం, జొన్న, చెరుకు వ్యర్థాలను ఉపయోగించి ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయంగా బయో డిగ్రేడబుల్ వస్తువుల తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. రెండో విడతలో రూ. 1,500 కోట్ల పెట్టుబడులతో క్లీన్ టెక్నాలజీ, రోబోటిక్స్, డిజిటల్ ప్లాట్‌ఫాం, బిగ్ డేటా మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్లను ఏర్పాటు చేయనున్నట్టు ఆయన తెలిపారు.