సరికొత్తగా ‘తెలంగాణ ప్రగతి రథం’
సీఎం మైన్‌ప్రూఫ్ వాహనంలో పలు మార్పులు
సాక్షి, హైదరాబాద్: పటిష్టమైన భద్రతా ప్రమాణాలు, అత్యాధునిక సదుపాయాలతో రూపొందించిన సీఎం కేసీఆర్ మైన్ ప్రూఫ్ వాహనం సరికొత్త హంగులను సంతరించుకుంటోంది. వాహనం పేరు సైతం ‘తెలంగాణ ప్రగతి రథం’గా నామకరణం చేశారు. హరిత హారం కార్యక్రమాన్ని ప్రతిబింబించే లా వాహనాన్ని తెలుపు, ఆకుపచ్చ రంగుల్లో ముస్తాబు చేశారు. చండీఘర్‌కు చెందిన కోచ్వర్క్ సంస్థ జేసీబీఎల్ ఈ వాహనాన్ని తయారు చేసిన సంగతి తెలిసిందే.
సుమారు రూ.5 కోట్లతో రూపుదిద్దుకున్న సీఎం భద్రతా వాహనం హైదరాబాద్‌కు వచ్చిన ఒకటి, రెండు రోజుల్లోనే కొన్ని లోపాలను గుర్తించారు. ఇంటీరియర్ డెకరేషన్‌లోనూ కొన్ని మార్పులు చేయవలసి ఉందని ఆర్టీసీ ఇంజనీరింగ్ అధికారులు గుర్తించారు. ఈ మేరకు గత వారం రోజులుగా హైదరాబాద్-1 డిపోలో జేసీబీఎల్ మెకానిక్ నిపుణులతో పాటు, ఆర్టీసీ అధికారుల పర్యవేక్షణలో మార్పులు, చేర్పులు చేపట్టారు.‘వాహనం డిజైన్ ఎంతో బాగుందని, దాని లోపల కొన్ని అదనపు హంగులు, సదుపాయాలు మాత్రమే ఏర్పాటు చేస్తున్నట్లు’ ఆర్టీసీ ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’తో చెప్పారు. రెండు, మూడు రోజుల్లో వాహనం సరికొత్త హంగులతో అందుబాటులోకి రానున్నట్లు పేర్కొన్నారు.
ఇలా మార్పులు చేశారు...
* ప్రధాన రహదారులపై వాహన గమనంలో ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ ఇరుకుదారుల్లో ఎక్కడైనా గుంతలు వచ్చినప్పుడు హై స్పీడ్‌తో వెళితే వాహనం లెఫ్ట్ కార్నర్ స్వల్పంగా నేలకు తాకుతున్నట్లు గమనించి దానిని రీమేక్ చేశారు.
* సీఎం డయాస్‌పైకి చేరుకొనేందుకు డోర్లు తేలిగ్గా తెరుచుకొనేలా హైడ్రాలిక్ సిస్టమ్‌ను అభివృద్ధి చేశారు.
* సీఎం సూచన మేరకు ఆయన సీటు వద్ద రైటింగ్ ప్యాడ్ ఏర్పాటు చేశారు.
* ఆడియో సామర్ధ్యాన్ని పెంచారు. టూ వే కమ్యూనికేషన్ వ్యవస్థను మరింత మెరుగుపర్చారు.