గణతంత్ర పరేడ్‌లో తెలంగాణకు నిరాశ
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర ఆవిర్భావం తరువాత తొలిసారిగా జరుగుతున్న గణతంత్ర పరేడ్‌లో పాల్గొనేందుకు తెలంగాణ శకటానికి అనుమతి లభించలేదు. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా పాల్గొనడంతోపాటు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత జరుగుతున్న ఈ గణతంత్ర పరేడ్ ప్రత్యేకత సంతరించుకుంది. అయితే, తొలిసారి వేడుకల్లోనే తెలంగాణ శకటంనకు అనుమతి లభించకపోవడం తెలంగాణ ప్రజలను నిరాశకు గురిచేస్తోంది. తెలంగాణ నుంచి ‘బోనాలు పండుగ’ శకటం ప్రదర్శనకు అనుమతి కోరుతూ తెలంగాణ ప్రభుత్వం రక్షణ మంత్రిత్వశాఖకు ప్రతిపాదనలు పంపింది.
దీనిపై సీఎం కేసీఆర్ ఆర్థికమంత్రి (అప్పటి రక్షణశాఖమంత్రి) అరుణ్‌జైట్లీకి లేఖ రాశారు. అయినప్పటికీ ఎంపిక కమిటీ తెలంగాణ శకటాన్ని తిరస్కరించింది. ఇదిలాఉండగా, ఏపీ పంపిన ‘సంక్రాంతి శకటం’కు రక్షణ మంత్రిత్వశాఖ అనుమతి లభించడం విశేషం. ఉమ్మడి రాష్ట్రంలో చివరిసారిగా 2009లో గణతంత్రవేడుకల్లో రాష్ట్రం నుంచి ‘అన్నమయ్య’ శకటాన్ని ప్రదర్శించారు. ఐదేళ్ల విరామం తరువాత కొత్తగా ఏర్పాటైన ఏపీకి 2015లో అవకాశం లభించింది.