నీటి విడుదలపై రైతుల అసంతృప్తి
తీలేర్ (ధన్వాడ) : కోయిల్‌సాగర్ కాల్వలు మరమ్మతుకు నోచుకోక చివరి ఆయకట్టుకు నీరు చేరడం లేదని తీలేర్ గ్రామ రైతులు పటేల్ శ్రీనివాస్, రాంచంద్రయ్య, రాములు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆదివారం వారు శిథిలావస్థకు చేరిన కోయిల్‌సాగర్ కాల్వలను పరిశీలించారు. కాల్వలో మొలకెత్తిన ముళ్లచెట్లు, శిథిలావస్థకు చేరిన తూములతో సాగునీరు ముందుకు చేరని పరిస్థితి ఏర్పడిందన్నారు. పాత ఆయకట్టుకే దిక్కులేదు, కొత్తగా 8వేల ఎకరాలకు సాగునీరు ఎలా విడుదల చేస్తారని వారు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. నీరు విడుదల చేసి పది రోజులు గడుస్తున్నా నేటికీ 16వ తూముకు చుక్కనీరు చేరలేదన్నారు. ఇష్టానుసారంగా కాల్వలను తెంపుకుంటూ పోతే పంటలకు నీరు ఎలా అందుతుందని మండిపడ్డారు. ఉపాధి కూలీల ద్వారా కోయిల్‌సాగర్ కాల్వలు, తూములకు మరమ్మతు చేపట్టాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆందోళన చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో నర్సింహులు, రాములు, కుర్మన్న, సాయన్న, ఆంజనేయులు పాల్గొన్నారు.