జీఆర్పీలో గొంతు కోసుకున్న దొంగ
రైల్వేగేట్ : వరంగల్ రైల్వేస్టేషన్‌లోని జీఆర్పీలో మంగళవారం ఉదయం ఓ నిందితుడు గొంతు కోసుకున్న సంఘటన కలకలం రేపింది. జీఆర్పీ సీఐ స్వామి కథనం ప్రకారం.. వరంగల్ నగరంలోని పోచమ్మమైదాన్‌లోని వాసవీ కాలనీలోగల లక్ష్మి మెస్ అండ్ పేయింగ్ గెస్ట్ హాస్టల్లో ఐదుగురు వ్యక్తులు ఉంటున్నారు. అదే హాస్టల్‌కు వారం రోజుల క్రితం హైదరాబాద్ ఈసీఐఎల్ ప్రాంతానికి చెందిన వారణాసి అజయ్ వచ్చాడు. మంగళవారం తెల్లవారుజామున 4 గంటలకు అజయ్ ఎవరికీ చెప్పకుండా మిగతా ఐదుగురి బ్యాగులు, వారి సెల్ఫోన్లు తీసుకుని వరంగల్ రైల్వేస్టేషన్‌కు వచ్చాడు. గమనించిన మిగతా ఐదుగురు వెంటనే వరంగల్ రైల్వేస్టేషన్‌కు వచ్చారు. అక్కడ వారిని చూసిన అజయ్ పుష్పుల్ రైలు ఎక్కాడు. వారు కూడా రైలు ఎక్కడంతో అతడు వెంటనే రైలు నుంచి దూకేశాడు. వారు అతడిని పట్టుకుని వరంగల్ జీఆర్పీ తీసుకొచ్చారు. జరిగిన సంఘటనను పోలీసులకు వివరించగా వారు అజయ్‌ని మట్టెవాడ రైల్వేస్టేషన్‌కు తరలించే క్రమంలో ఒక్కసారిగా అతడు తన వద్ద ఉన్న పదునైన ఇనుప ముక్కతో గొంతు కోసుకున్నాడు. వెంటనే అతడిని ఎంజీఎం ఆస్పత్రికి తరలించినట్లు సీఐ స్వామి వివరించారు. పేయింగ్ గెస్ట్ హాస్టల్ నుంచి బ్యాగులు, సెల్ఫోన్లు అపహరించిన కేసు మట్టెవాడ రైల్వేస్టేషన్లో అజయ్‌పై నమోదు చేసినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం అజయ్‌కి ఎలాంటి ప్రాణహానీ లేదని సీఐ చెప్పారు.