పెళ్లింట విషాదం
మూడు గుడిసెలు దగ్ధం
ఓ గుడిసెలో పెళ్లి సామగ్రి, రూ.2లక్షలు దగ్ధం
దాదాపు రూ.5లక్షలకు పైగా నష్టం
ఎమ్మిగనూరు టౌన్: పట్టణంలోని శాంతినగర్లో సోమవారం మధ్యాహ్నం జరిగిన అగ్నిప్రమాదంలో మూడు గుడిసెలు పూర్తిగా దగ్ధమయ్యాయి. మూడు కుటుంబాల బాధితులు కట్టుబట్టలతో రోడ్డున పడ్డారు. మున్సిపాలిటీలో పారిశుద్ధ్య కార్మికుడుగా పనిచేస్తున్న వీరేష్ ఇంట్లో ముందుగా మంటలు చెలరేగాయి. చుట్టుపక్కల వారు గమనించేలోపు మంటలు పక్కనే ఉన్న మరో రెండు గుడిసెలకు వ్యాపించాయి. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి వచ్చి మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రమాదానికి ఇంట్లో దేవుని ముందు ఉంచిన దీపమే కారణమై ఉంటుందని అగ్నిమాపకశాఖ అధికారులు పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో వీరేష్ గుడిసెలోని వంట సరుకు, సామగ్రి, బట్టలు పూర్తిగా కాలిపోయాయి.
అలాగే జాతరలు తిరుగుతూ రింగుల ఆటతో జీవనం సాగిస్తున్న మహేష్ గుడిసెలోని వస్తువులన్నీ బూడిదయ్యాయి. ఇక ఆర్టీసీలో చిరు ఉద్యోగిగా పనిచేస్తున్న బాలముని కుటుంబానికి ప్రమాదం తీవ్ర విషాదం నింపింది. ఆదివారం కూతురు కృష్ణవేణి పెళ్లి ఉంది. అందుకోసం ఖర్చుల నిమిత్తం ఇంట్లో ఉంచిన రూ.2 లక్షలు, పెళ్లిబట్టలు, ఇతర వస్తువులన్నీ కాలి బూడిదయ్యా యి. ఈ ప్రమాదంలో దాదాపు రూ.5నుంచి రూ.7లక్షల దాకా ఆస్తినష్టం జరిగి ఉంటుందని స్థానికులు తెలిపారు. బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.