పాక్ తీవ్రవాదులను హతమార్చిన భారత సైన్యం
శ్రీనగర్ః భారత సరిహద్దుల్లో ముగ్గురు పాకిస్థాన్ తీవ్ర వాదులను ఆదివారం కాల్చి చంపినట్లు భారత భద్రతా బలగాలు వెల్లడించాయి. వివాదాస్పద కశ్మీర్ ప్రాంతంలోని పాకిస్థాన్ సరిహద్దుల్లో రెండు రోజుల క్రితం ఓ గన్ మెన్ పై ముష్కరుల దాడి అనంతరం భారత్ లోకి చొరబడేందుకు యత్నించిన ముగ్గురు తీవ్రవాదుల్ని హతమార్చినట్లు భద్రతా బలగాల ప్రతినిధులు పేర్కొన్నారు.
ఉత్తర కశ్మీర్ తంగ్ధర్ సెక్టార్ ప్రాంతంలో భారత్ లోకి చొరబడేందుకు యత్నంచిన ముగ్గురు పాకిస్థాన్ మిలిటెంట్లను హతమార్చి, వారినుంచీ 3 రైఫిళ్ళను స్వాధీనం చేసుకున్నట్లు ల్యూటినెంట్ కొలొనెల్ మనీష్ కుమార్ తెలిపారు. ఈ సంవత్సరం ఇప్పటివరకూ కశ్మీర్ లోయలో భారత బలగాలు 103 మంది తీవ్రవాదులను హతమార్చాయని, ఇటీవలి సంవత్సరాల్లో ఇదే అత్యధిక సంఖ్యగా ఆయన పేర్కొన్నారు. ఈ సంవత్సరం జూలై వరకూ 56 మంది మిలిటెంట్లు కశ్మీర్ లోకి చొరబడగా, గతేడాది ఇదే కాలంలో 36 మంది చొరబడ్డట్లు అధికారిక అంచనాల ప్రకారం తెలుస్తోంది.
భారతదేశంలో భాగమైన జమ్ము కశ్మీర్ లో సీమాంతర ఉగ్రవాదాన్ని అణచివేసేందుకు ఓ పక్క భారత్ ప్రయత్నిస్తుండగా.. పాకిస్తాన్ మాత్రం ఇటువంటి కార్యకలాపాలను ఖండిస్తోంది. మెజారిటీ ముస్లింలు కలిగిన కశ్మీర్ ప్రాంతంలో జూలై 8న ఓ పాకిస్థానీ మిలిటెంట్ ను భద్రతా బలగాలు హతమార్చిన నేపథ్యంలో తలెత్తిన ఆందోళనల్లో ఇప్పటివరకూ 65 మంది మరణించగా.. సుమారు 6,000 మంది గాయపడ్డారు.