Train management
-
రైళ్ల సమయపాలనను మెరుగుపర్చండి
అధికారులకు రైల్వే జీఎం రవీంద్రగుప్తా సూచన సాక్షి, హైదరాబాద్: అన్ని మెయిల్, ఎక్స్‌ప్రెస్, ప్యాసింజర్, ఎంఎంటీఎస్ రైళ్ల నిర్వహణ, సమయపాలనను మరింత మెరుగుపరచాలని దక్షిణమధ్య రైల్వే జనరల్ మేనేజర్ రవీంద్రగుప్తా సూచించారు. వివిధ విభాగాలకు చెందిన ఉన్నతాధికారులతో రైల్ నిలయంలో సోమవారం నిర్వహించిన సమావేశంలో ఆయన పలు సూచనలు, సలహాలు, ఆదేశాలు ఇచ్చారు. రైళ్ల నిర్వహణలో భద్రతాపరమైన నిబంధనలు కచ్చితంగా పాటించాలని, నిరంతరం అప్రమత్తంగా ఉండాల న్నారు. కాపలాలేని గేట్లు ఒక ప్రధాన సమస్య అని, వాటి వద్ద భద్రతా చర్యలను పటిష్టం చేయాలని పేర్కొన్నారు. స్వచ్ఛభారత్, డిజిటల్ ఇండియా కార్యక్రమాల్లో భాగంగా దక్షిణమధ్య రైల్వేలోని క్యాంటీన్లు, ట్రైనింగ్ సెంటర్ల వద్ద సహజ ఎరువుల తయారీకి ప్రాధాన్యతనివ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు జనరల్ మేనేజర్ ఏకే గుప్తా తదితరులు పాల్గొన్నారు. -
‘రైల్వే’ మందకొడితనం
సికింద్రాబాద్ కేంద్రంగా పని చేస్తున్న దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని పలు సూపర్‌ఫాస్ట్, ఎక్స్‌ప్రెస్, పాసింజర్ తదితర రైళ్లు నిర్ణీత సమయాన్ని పాటించకపోవడంతో ప్రయాణికులు నానా అవస్థలు పడుతున్నారు. సికింద్రాబాద్ నుండి వివిధ రాష్ట్రాలకు ఎన్నో రైళ్లు ప్రయాణం చేస్తుంటాయి. ప్రయాణికులను సరైన సమయానికి గమ్యస్థానాలకు చేర్చడంలో పూర్తిగా విఫలమవుతున్నాయి. ఎన్నోమార్లు రైల్వే మంత్రిత్వశాఖ నుండి నిర్ణీత సమయాలలో రైలు నడపాలని ఆదేశాలున్నా వాటిని పాటించడంలో రైల్వేశాఖ నిర్లక్ష్యం వహిస్తోంది. ఒక్కొక్కసారి ఫలానా సమయానికి రైలు వస్తుందని వివిధ స్టేషన్లలో మైక్ ద్వారా అనౌన్స్మెంట్ జరిగిన 2 నుండి 3 గంటల సమయం వరకు రైలురాని పరిస్థితి దాపురించడంతో ప్రయాణికులు రైలు ఎక్కడానికి ఇబ్బంది పడుతున్నారు. ఇకనైనా రైల్వేశాఖ ఉన్నత అధికారులు నిర్ణీత సమయానికి రైళ్లు నడిపించేలా చర్యలు తీసుకొని ప్రయాణికులకు ఇబ్బందులు కలుగకుండా చూడాలని మనవి. - మంకమ్మ తోట, ప్రభుత్వ ఉపాధ్యాయిని, కరీంనగర్