గాల్లో దీపం!
నాగరికతకు చిహ్నాలుగా, సరిహద్దులను సౌకర్యవంతంగా కలపాల్సిన రహదారులు రక్తసిక్తమవుతున్నాయి. ప్రయాణికుల పాలిట మృత్యుకుహరాలుగా మారుతున్నాయి. రోడ్డెక్కితే చాలు పరలోకానికి ప్రయాణం..అన్నంతగా తయారయ్యాయి. ఎక్కడి నుంచి ఏ వాహనం వచ్చి ఢీకొడుతుందో అంతుబట్టదు. ట్రాఫిక్ పద్మవ్యూహం నుంచి బయటపడి క్షేమంగా ఇంటికి తిరిగొస్తారనే గ్యారంటీ లేదు. ‘బ్లాక్‌స్పాట్’గా అభివర్ణించే ప్రాంతాలను సరిదిద్దే చర్యలు ఎక్కడా కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో ఈనెల 20 నుంచి 26వ తేదీవరకు రోడ్డు రవాణాశాఖ ఆధ్వర్యంలో రోడ్డుభద్రతా వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. కనీసం ఇప్పటి నుంచైనా సరైనచర్యలు చేపట్టాలని ట్రాన్స్‌పోర్టు ఇంజనీరింగ్ నిపుణులు సూచిస్తున్నారు.
మహబూబ్‌నగర్ క్రైం, న్యూస్‌లైన్: దేశంలో అత్యంత ప్రమాదకరమైన రహదారుల జాబితాలో జిల్లాలోని కొత్తూరు, శాఖాపూర్ ప్రాంతాలు చోటుదక్కించుకున్నాయి. జాతీయస్థాయిలోనే అతిపెద్ద ప్రమాదంగా కొత్తకోట మండలం పాలెం వద్ద వోల్వో బస్సు డివైడర్‌ను ఢీకొని 45 మంది అగ్నికి ఆహుతైన సంఘటన సంచలనం రేకెత్తించింది. అయినా రోడ్డురవాణాశాఖ స్పందించిన దాఖలాలు లేవు.
ప్రమాదాల పరంపరలో 2011లో జిల్లాలో 251 మంది మృత్యువాతపడ్డారు. 2012లో 241 మంది ప్రాణాలు కోల్పోయారు. 2013లో 286 మంది దుర్మరణం పాలయ్యారు. రోడ్డు ప్రమాదాలకు రహదారుల నిర్మాణమూ ఓ కారణమని నిపుణులు భావిస్తున్నారు. జాతీయ, రాష్ట్ర రహదార్లు నిర్మించేటప్పుడు, షోల్టర్లు, బర్ములు సక్రమంగా ఉన్నాయా? లేదా? ఒకటికి రెండు సార్లు కచ్చితంగా చూడాలి. కూడళ్ల వద్ద అవతలి నుంచి వచ్చే వారు ఇవతలి వారికి 40 నుంచి 50 డిగ్రీల కోణంలో క నిపించాలి. రోడ్డు మలుపు పూర్తిగా తిరగకముందే ఎదురుగా వచ్చే వాహనాలు దారి ఇచ్చేవిధంగా ఉండాలి. వీటిలో చాలావరకు జాతీయ రహదారుల్లో కనిపించడం లేదు. కూడళ్ల వద్ద రోటరీలను సక్రమంగా ఏర్పాటు చేస్తున్నా విస్తరణ అనంతరం వాటిని పట్టించుకోవడం లేదు. కూడలి విశాలంగా ఉండి రోటరీ చిన్నగా మారిపోవడంతో తరుచూ ప్రమాదాలు చోటుకుంటున్నాయి. అడ్డాకుల మండల పరిధిలోని జాతీయ రహదారిపై నమోదవుతున్న ప్రమాదాలే ఇందుకు నిదర్శనం.. ఒకే ప్రాంతంలో ప్రమాదా లు జరిగితే వెంటనే దాన్ని ‘బ్లాక్‌స్పాట్’గా గుర్తిసా ్తరు. జిల్లాలోని జాతీయ రహదారిపై రెండు ప్రాంతాల్లో గత రెండేళ్ల క్రితమే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు బ్లాక్‌స్పాట్‌గా గుర్తించారు. దీన్ని పరిగణలోకి తీసుకుని అయినా భద్రతకు పెద్దపీట వేయాల్సింది. ఇప్పటివరకు అధికారులు ఎలాంటి దిద్దుబాటు చర్యలు చేపట్టలేదు.
రాత్రి ప్రమాదాలపై నియంత్రణ చేపట్టాలి
రాత్రి వేళల్లో చోటుచేసుకున్న ఘటనలను నియంత్రిస్తే ప్రమాదాల సంఖ్యలో దాదాపు 70 శాతం తగ్గుతుంది. వాహనాల లైట్ల ద్వారా వచ్చే కాంతిని ప్రమాదాలకు దోహదం చేస్తుంది. డివైడర్ల మధ్యచెట్లు ఎత్తుగా పెంచడం, కూడళ్లకు సమీపంలో 50 మీటర్ల వద్ద కాని 30 మీటర్ల వద్ద గాని స్పీడ్ బ్రేకర్లను ఏర్పాటు చేయాలి. చెట్లు బాగా ఎ త్తుగా ఉండటం వల్ల విల్డింగ్ విడ్త్ పెరుగుతుంది. దీంతో ప్రమాదం జరిగినా కనీసం మూడు సెకండ్ల తీవ్రత తగ్గుతుంది. వాహనం వేగంతో పోలిస్తే ఈ సమయం ఎంతో విలువైందని జిల్లా ఎస్పీ నాగేంద్రకుమార్ సూచించారు.
నిబంధనలు పాటించాలి..
అతివేగం ప్రమాదకం.. మద్యం లేదా మత్తుపదార్థాలు సేవించి వాహనం నడుపరాదు. సెల్‌ఫోన్ మాట్లాడుతూ వాహనం నడపరాదు. సీటు బెల్టును ధరించాలి. రాత్రివేళలో వాహనాన్ని నిలిపి ఉంచినప్పుడు పార్కింగ్ లైట్లు తప్పనిసరిగా వేయాలి. ట్రాఫిక్ సిగ్నల్స్‌ను గమనించి, వాహనాలను నడపాలి. నియమాలను ఎల్లవేళలా పాటిస్తే ప్రమాదాలను అరికట్టవచ్చు. రోడ్డుభద్రతపై ప్రతిఒక్కరికీ అవగాహన కల్పించేందుకు ఈ నెల 20నుంచి 26వ తేదీ వరకు రోడ్డు భద్రత వారోత్సవాలను నిర్వహిస్తున్నాం.
-కిష్టయ్య, ఆర్టీఓ, మహబూబ్‌నగర్