వేతన సవరణకు యూజీసీ కమిటీ
న్యూఢిల్లీ: యూనివర్సిటీలు, కాలేజీల్లోని బోధన సిబ్బందికి వేతన సవరణ కోసం ఐదుగురు సభ్యుల కమిటీని గురువారం యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) ఏర్పాటు చేసింది. కమిటీకి యూజీసీ సభ్యుడు ప్రొఫెసర్ వీఎస్ చౌహాన్ నేతృత్వం వహిస్తారు. ప్రొఫెసర్ దురైస్వామి(మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెవలప్మెంట్ స్టడీస్), ప్రొఫెసర్ రాంసింగ్(ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్), ఆర్సీ పాండా(మాజీ ఐఏఎస్), హెచ్చార్డీ శాఖ సంయుక్త కార్యదర్శి ప్రవీణ్ కుమార్ సభ్యులుగా ఉన్న ఈ కమిటీ ఆరునెలల్లో నివేదిక సమర్పిస్తుంది.
వర్సిటీలు, కాలేజీ టీచర్లు, లైబ్రేరియన్లు, వ్యాయామ ఉపాధ్యాయులు ఇతర బోధన సిబ్బంది వేతనాలకు సంబంధించి గతంలో ప్రభుత్వం లేదా యూజీసీ తీసుకున్న నిర్ణయాల అమలునూ ఈ కమిటీ పరిశీలిస్తుంది. అలాగే, ప్రస్తుత వేతన వ్యవస్థ తీరును, కనీస అర్హత, కెరియర్ అడ్వాన్స్మెంట్ అవకాశాలు, సర్వీసు నిబంధనలు, మొత్తంగా లభించే ప్రయోజనాలు(రిటైర్మెంట్, వైద్య, గృహనిర్మాణ సౌకర్యాలు సహా).. తదితరాలనూ ఈ కమిటీ సమీక్షించనుంది. అలాగే, సమర్థులను బోధనారంగంలోకి ఆకర్షించేందుకు తీసుకోవాల్సిన చర్యలను కూడా ఈ కమిటీ సిఫారసు చేస్తుంది.