దయచేసి జీన్స్, స్కర్ట్స్తో రాకండి
ఉజ్జయిని: తమ దేవాలయంలోకి మహిళలు జీన్స్, స్కర్ట్స్ వేసుకొని ప్రవేశించకుండా ఉజ్జయినిలోని జైన దేవాలయ ట్రస్ట్ నిర్ణయం తీసుకుంది. ఎనిమిదేళ్లు పైబడిన వారంతా ఈ నిబంధనకు లోబడి ఆలయంలోకి రావాల్సి ఉంటుందని ప్రకటించారు. ఆదివారం ఈ నిర్ణయం తీసుకున్నారు. ఉజ్జయినిలో జైన మత శ్వేతాంబర సమాజానికి చెందిన వృషభదేవ ఆలయం ఉంది.
దీనిని చగ్నిరామ్ పెడి ట్రస్ట్ నిర్వహిస్తోంది. ఆలయ గౌరవాన్ని కాపాడేందుకోసం తీసుకునే చర్యల్లో భాగంగా ఆదివారం సమావేశం అయిన ట్రస్ట్ సభ్యులు కొత్తగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎనిమిదేళ్లు పైబడిన బాలికలు, మహిళలు జీన్స్, టీ షర్ట్స్, స్కర్ట్స్, టాప్స్ వంటి పాశ్చాత్య దుస్తులు కాకుండా కేవలం భారతీయ సంప్రదాయంతో నిండిన వస్త్రాలనే ధరించాలని నిబంధన తీసుకొచ్చినట్లు ట్రస్ట్ అధ్యక్షుడు మహేంద్ర సిరోలియా చెప్పారు. జైన ఆలయంలోకి పాశ్చాత్య దుస్తులకు అవకాశం ఇవ్వబోమని తెలిపారు. ఆలయం లోపలికి ప్రవేశించిన తర్వాత 'చున్రీ'(తలను కప్పి ఉంచుకునే వస్త్రం) ఇస్తామని చెప్పారు. సరైన వస్త్రాధరణతో వచ్చిన ప్రతి ఒక్కరికి ఆలయంలోకి ప్రవేశం ఉంటుందని తెలిపారు.