తోషిబా నుంచి తొలి ఆల్ట్రా హెచ్డీ 4కే ల్యాప్‌టాప్
న్యూఢిల్లీ: తోషిబా కంపెనీ ప్రపంచంలోనే తొలి ఆల్ట్రా హెచ్డీ 4కే ల్యాప్‌టాప్‌ను మంగళవారం భారత మార్కెట్లోకి విడుదల చేసింది. ది శాటిలైట్ పి50 పేరుతో అందిస్తున్న ఈ ల్యాప్‌టాప్ ధర రూ.86,000 అని తోషిబా ఇండియా హెడ్(డీఎస్ డివిజన్) సంజయ్ వార్కే చెప్పారు. ఈ ల్యాప్‌టాప్‌లో 15.6 అంగుళాల టచ్‌స్క్రీన్ డిస్ప్లే, హై క్వాలిటీ హర్మాన్ కార్డన్ స్టీరియో స్పీకర్లు, ఫోర్త్ జనరేషన్ ఇంటెల్ కోర్ హెచ్ సిరీస్ ప్రాసెసర్లు, గేమింగ్ క్లాస్ ఏఎండీ రేడియోన్ ఆర్9 ఎం265ఎక్స్ గ్రాఫిక్స్ వంటి ఫీచర్లున్నాయని వివరించారు.
దీంతో పాటు నోట్‌బుక్‌లను, టూ-ఇన్-వన్(ట్యాబ్లెట్ కమ్ నోట్‌బుక్)లను కూడా అందిస్తున్నామని తెలిపారు. నోట్‌బుక్‌గానూ, కీ బోర్డ్‌ను తొలగిస్తే ట్యాబ్లెట్‌గానూ ఉపయోగించుకునే 2-ఇన్-1ల రంగంలోకి కొత్తగా ప్రవేశించామని వివరించారు. ది శాటిలైట్ ఎల్30డబ్ల్యూ పేరుతో అందిస్తున్న ఈ 2-ఇన్-1ను వచ్చే నెల నుంచి విక్రయిస్తామని, ధర రూ.53,520 అని పేర్కొన్నారు. శాటిలైట్ ఎల్ రేంజ్ నోట్‌బుక్‌లను రూ.25,785 నుంచి రూ. 51,340 రేంజ్లో, అలాగే శాటిలైట్ ఎస్40 నోట్‌బుక్‌ను రూ.50,790కు అందిస్తున్నామని వివరించారు.
వచ్చే ఏడాది మార్చి కల్లా భారత్‌లో అగ్రశ్రేణి మూడు పీసీ కంపెనీల్లో ఒకటిగా నిలవడం లక్ష్యమని సంజయ్ వివరించారు. ఈ కొత్త డివైస్లతో తమ మార్కెట్ వాటా మరింతగా పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అంతర్జాతీయంగా ట్యాబ్లెట్లను విక్రయిస్తున్నామని, భారత్‌లో వాటిని ప్రవేశపెట్టే అంశంపై కసరత్తు చేస్తున్నామని వివరించారు.