జాగృతి సభకు రండి
గవర్నర్ నరసింహన్‌కు ఎంపీ కవిత ఆహ్వానం
సాక్షి, హైదరాబాద్: సెప్టెంబర్ 2న హైదరాబాద్‌లో జరిగే జాగృతి బహిరంగ సభకు హాజరు కావాల్సిందిగా రాష్ట్ర గవర్నర్ ఇ.ఎస్.ఎల్.నరసింహన్‌ను తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత ఆహ్వానించారు. మంగళవారం ఈ మేరకు రాజ్‌భవన్‌లో ఆమె గవర్నర్‌ను కలిశారు. హైదరాబాద్ అశోక్‌నగర్‌లోని జాగృతి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్‌ను కేంద్ర మంత్రి రాజీవ్ ప్రతాప్ రూడీ ప్రారంభిస్తున్నారని, అదే రోజు సాయంత్రం దోమలగూడలోని ఎ.వి.కళాశాల ప్రాంగణంలో జాగృతి బహిరంగ సభ జరుపుతున్నామని గవర్నర్‌కు వివరించారు.
సభకు హాజరు కావాలని ఆయనను కోరారు. రాష్ట్రవ్యాప్తంగా 17 పార్లమెంటు నియోజకవర్గ కేంద్రాల్లో జాగృతి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు నడుస్తున్నాయని తెలిపారు. వీటిలో ఇప్పటివరకు 3,500 మంది నిరుద్యోగులకు శిక్షణ ఇచ్చామని, అందులో 1,500 మందికి ఆయా సంస్థల్లో ప్లేస్మెంట్లు కూడా కల్పించినట్లు వివరించారు. సభకు తాను హాజరవుతానని గవర్నర్ తెలిపినట్లు కవిత చెప్పారు.