తమిళనాడు తరహాలో విద్యుత్ రాయితీ ఇవ్వాలి
కోటగుమ్మం (రాజమహేంద్రవరం) :
తమిళనాడు రాష్ట్రం తరహాలో యూనిట్ ధర ఒక్క రూపాయికే మన రాష్ట్ర ప్రభుత్వం కూడా విద్యుత్‌ను సరఫరా చేయాలని అఖిల భారతీయ విశ్వకర్మ పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు ఏడీ కామాచార్యులు డిమాండ్ చేశారు. రంగ్రీజుపేటలోని పరిషత్ కార్యాలయంలో శనివారం జరిగిన కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. కమ్మర, వడ్రంగి, కంచర, శిల్ప, స్వర్ణకార కుటీర పరిశ్రమలకు విద్యుత్ సబ్సిడీ యూనిట్ ధర రూ. 1.80కే అందిస్తోందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లో ఆరు వేల యూనిట్లకు మాత్రమే విద్యుత్ పంపిణీ సంస్థలు ఈ సదుపాయాన్ని కలగజేశాయని ఆయనన్నారు. అయితే రాష్ట్రంలోని ఒక్కో జిల్లాలో 12 వేల నుంచి 20 వేల కుటీర పరిశ్రమలు ఉన్నాయని, వారందరికీ విద్యుత్ సబ్సిడీ సదుపాయం కల్పించాలని డిమాండ్ చేశారు.కుటీర పరిశ్రమలపై ప్రస్తుతం ఉన్న విధానాలన్నింటిని మార్చి తమిళనాడు తరహాలో యూనిట్ ధర రూ. 1కే విద్యుత్ సరఫరా చేయాలని కోరారు. జిల్లా అధ్యక్షుడు బంటుమిల్లి బేబీరావు, ముంతా సత్యనారాయణ, గుండేపల్లి అమృతకుమార్, ప్రధాన కార్యదర్శి కోరుమిల్లి సత్యనారాయణ పాల్గొన్నారు.