కార్పొరేట్ బ్యాంకులు కష్టమే!
♦ టాటా, బిర్లా, రిలయన్స్‌లకు నిబంధనల అడ్డంకి
♦ 60 శాతం ఆదాయం ఆర్థిక సేవల నుంచే రావాలి..
♦ ఈ నిబంధనే బడా కార్పొరేట్లకు ప్రధాన అవరోధం
♦ యూనివర్సల్ బ్యాంకులకు మార్గదర్శకాలు విడుదల
ముంబై: యూనివర్సల్ బ్యాంకు లెసైన్సు పొంది పూర్తిస్థాయి బ్యాంకింగ్‌లోకి దిగుదామని ఆశించిన టాటా, బిర్లా, రిలయన్స్ వంటి దిగ్గజాలకు నిరాశే ఎదురైంది. వీటికి సంబంధించి తాజాగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) జారీ చేసిన మార్గదర్శకాలు వీటికి వ్యతిరేకంగా ఉండటమే ఇందుకు కారణం. కంపెనీలు, సంస్థలు, గ్రూప్‌లు, వ్యక్తులకు యూనివర్సల్ బ్యాంక్ లెసైన్స్ ఇస్తామని ఆర్బీఐ గురువారం ప్రతిపాదించింది. ఈ మేరకు ముసాయిదా మార్గదర్శకాలు కూడా విడుదల చేసి... జూన్ 30లోపు వీటిపై సంబంధిత వర్గాలుస్పందించాలని ఆర్బీఐ కోరింది. ఈ నిబంధనల్ని ఒక్కసారి చూస్తే...
♦ యూనివర్సల్ బ్యాంకు లెసైన్సు కోసం దరఖాస్తు చేసే కంపెనీ, వ్యక్తి లేదా గ్రూప్ ఆదాయంలో కనీసం 60 శాతం ‘ఫైనాన్షియల్ సేవల’ నుంచి వస్తుండాలి. ఈ నిబంధనే ఇపుడు రిలయన్స్ ఇండస్ట్రీస్, టాటా, బిర్లా గ్రూపులను అడ్డుకుంటోంది.
♦ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు (ఎన్బీఎఫ్సీలు) వీటికోసం దరఖాస్తు చేయొచ్చు. కానీ వీటిని కార్పొరేట్లు ప్రమోట్ చేసి ఉండకూడదు.
♦ కార్పొరేట్ గ్రూప్‌లైతే నాన్ ఆపరేటివ్ ఫైనాన్షియల్ హోల్డింగ్ (ఎన్‌ఓఎఫ్‌హెచ్‌సీ) కంపెనీ ద్వారానే బ్యాంకును ఏర్పాటు చేయాల్సి ఉంటుంది.
పై నిబంధనలు పెద్ద కార్పొరేట్ల బ్యాంకింగ్ లెసైన్సులకు ఇబ్బంది కల్గిస్తుందని విశ్లేషకులు అంటున్నారు. అలాగే సాంకేతికంగా ఇబ్బందులు సృష్టిస్తున్న మరికొన్ని కారణాలను సైతం నిపుణులు ప్రస్తావిస్తున్నారు. ఈ విషయాలను పరిశీలిస్తే... కార్పొరేట్ హౌస్‌లు లేదా వారి ప్రమోటర్లు కొత్త బ్యాంకులో కేవలం 10 శాతం వరకూ మాత్రమే వాటాను కలిగి వుండాలి. బ్యాంకు పూర్తి నియంత్రణ సాధ్యపడదు. అదే సమయంలో ఐదేళ్ల లాకిన్ పిరియడ్‌తో బ్యాంక్‌లో 40 శాతం ప్రమోటర్ పెయిడప్ కాపిటల్ ఉండాలి.
ఒకవేళ 40 శాతం దాటి పెయిడప్ వోటింగ్ ఈక్విటీ క్యాపిటల్ ఉంటే... ఐదేళ్లలో దీనిని 40 శాతానికి తగ్గించుకోవాలి. అటు తర్వాత పదేళ్లలో 30 శాతానికి, 12యేళ్లలో 15 శాతానికి తగ్గించాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించిన అంశాలు... సాంకేతికంగా సాధ్యపడవు కనుక... బ్యాంకింగ్ లెసైన్సుల రేసు నుంచి బడా సంస్థలు పక్కకు తప్పుకోక తప్పదని అడ్వైజరీ సర్వీసెస్ ఎల్ఎల్పీ ప్రతినిధి అశ్విన్ పరేశ్ పేర్కొన్నారు. పలు పరిశ్రమలను నిర్వహించే గ్రూప్‌లకు ప్రజల ధనం నిర్వహించే బ్యాంకులో అధిక వాటా ఉండకూడదని ఆర్బీఐ నిబంధనలు కోరుకుంటున్నట్లు ముంబైకి చెందిన ఆర్థిక నిపుణుడు నితిన్ కుమార్ పేర్కొన్నారు.
అయితే ఇది బ్యాంకింగ్ పారదర్శకతను పెంపొందించడానికి ఇది దోహదపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. కార్పొరేట్ గ్రూప్- నాన్ ఆపరేటివ్ ఫైనాన్షియల్ హోల్డింగ్ (ఎన్‌ఓఎఫ్‌హెచ్‌సీ) కంపెనీ ద్వారానే బ్యాంకింగ్‌ను ఏర్పాటు చేయాల్సి ఉండడం, బ్యాంకింగ్ లెసైన్సుల బరిలో నిలిచే నాన్‌బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలకు కనీసం 10 ఏళ్ల ట్రాక్ రికార్డ్ ఉండాలన్న నిబంధనలు బ్యాంకింగ్ లెసైన్సులు పొందాలనుకుంటున్న సంస్థలకు కఠినమైనవేనని వారి వాదన.
రేసులో యుఏఈ ఎక్సే ్ఛంజ్, ఐఐఎఫ్ఎల్ హోల్డింగ్స్...
ఎన్‌బీఎఫ్‌సీలైన యూఏఈ ఎక్స్ఛేంజ్, ఐఐఎఫ్ఎల్ హోల్డిం గ్స్‌లు బరిలో నిలిచే అవకాశం ఉందని వినవస్తోంది. రెండు సంస్థల సీనియర్ అధికారులూ లెసైన్స్‌కు దరఖాస్తు చేసే విషయాన్ని ఆలోచిస్తున్నట్లు సమాచారం.