‘విశ్వ’మంత లక్ష్యం
- బీఆర్ఎస్, ఎల్ఆర్ఎస్కు పచ్చజెండా
- కౌన్సిల్‌కు రూ.50 కోట్ల వరకు మంజూరు అధికారం
- స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక ప్రణాళికలతో సమస్యలకు పరిష్కారం
- స్వచ్ఛ హైదరాబాద్ సమన్వయ కమిటీ ప్రాథమిక నివేదిక
- నేడు సీఎంతో సమావేశం
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్‌ను విశ్వ నగర స్థాయికి తీసుకు వెళ్లేందుకు... వివిధ సమస్యల పరిష్కారానికి... స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక ప్రణాళికలతో ముందుకు సాగాలని ప్రజాప్రతినిధులతో కూడిన సమన్వయ కమిటీ నిర్ణయించింది. నగరాన్ని స్లమ్ ఫ్రీ, చెత్త రహిత నగరంగా మార్చేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రతిపాదించింది. ఈమేరకు రాజకీయాలకు అతీతంగా అన్నిపార్టీల వారు ఏకగ్రీవ తీర్మానం చేశారు. బీఆర్ఎస్, ఎల్‌ఆర్‌ఎస్‌లకు కమిటీ పచ్చజెండా ఊపింది.
జీహెచ్ఎంసీ, వాటర్ బోర్డుల సమస్యలపై ఏర్పాటైన స్వచ్ఛ హైదరాబాద్ సమన్వయ కమిటీ సోమవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో సమావేశమై... మూడు గంటలకుపైగా సుదీర్ఘంగా సమీక్షించింది. ప్రస్తుతానికి స్వల్ప కాలిక సమస్యల పరిష్కారానికి సూచనలు చేస్తూ... ప్రాథమిక ముసాయిదాను సిద్ధం చేసింది. మంగళవారం సీఎం కేసీఆర్‌తో సమావేశమై... నివేదిక అందజేయనుంది. భవన నిర్మాణ అనుమతులు పారదర్శకంగా పొందేందుకు ఓ విధానాన్ని రూపొందించాలని కమిటీ అభిప్రాయపడింది. జీహెచ్ఎంసీ, వాటర్ బోర్డుల్లో దీర్ఘకాలంగా ఖాళీగా ఉన్న పోస్టులన్నింటినీ యుద్ధ ప్రాతిపదికన భర్తీచేయాలని సూచించింది. సమావేశం ముఖ్యాంశాలివీ...
- నాలాల ఆక్రమణలు, బాటిల్‌నెక్స్ రోడ్ల సమస్యల పరిష్కారానికి కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలి. నగరంలోని 74 నాలాల వెడల్పు, రక్షణ గోడల నిర్మాణాలకు డిప్యూటీ కలెక్టర్ నేతృత్వంలో టౌన్‌ప్లానింగ్, ఇంజినీరింగ్ అధికారులతో ప్రత్యేకంగా భూసేకరణ విభాగం ఏర్పాటు.
- గోడలపై రాతలు, పోస్టర్ల నిషేధం క చ్చితంగా అమలు. ఫ్లెక్సీలు, హోర్డింగులకు జీహెచ్ఎంసీ అనుమతుల మేరకు నిర్ణీత వ్యవధికి మాత్రమే పరిమితం. అతిక్రమిస్తే పెనాల్టీలతో పాటు ఇతర చర్యలు.
- డెబ్రిస్ తొలగింపు పనులను ఢిల్లీ తరహాలో ప్రైవేటు సంస్థకు అప్పగించాలని నిర్ణయం. ఇందుకుగాను సమన్వయ కమిటీ సభ్యులు ఢిల్లీలో పర్యటించాలి.
- నగరంలో 60 వేలకు పైగా అక్రమ నిర్మాణాలు ఉన్నట్లు అంచనా. ఈమేరకు బీఆర్ఎస్, ఎల్ఆర్ఎస్లను తిరిగి అమలు చేయాలని నిర్ణయం. భవిష్యత్తులో తిరిగి అక్రమ నిర్మాణాలకు తావులేకుండా చర్యలు. ఇందులో భాగంగా అక్రమ నిర్మాణాలకు విద్యుత్, తాగునీరు, డ్రైనేజీ సదుపాయాలను కల్పించకపోవడంతో పాటు రిజిస్ట్రేషన్లకు వీల్లేకుండా చట్టాల్లో మార్పులు తేవాలని సూచన.
- భవన నిర్మాణ అనుమతుల్లో పారదర్శకతకు సంస్కరణలు తేవాలని నిర్ణయం. దరఖాస్తు చేసిన 15 రోజుల్లో అనుమతులివ్వాలని, అందులో విఫలమైన అధికారులను బాధ్యులు చేయాలని నిర్ణయం. రెవెన్యూ మ్యాప్‌లను డిజిటలైజ్ చేయడంతో పాటు రెవెన్యూ, హెచ్ఎండీఏ, వాటర్ బోర్డుల మధ్య మరింత సమన్వయం అవసరం.
- చెత్త సమస్య పరిష్కారానికి అవసరమైనన్ని అదనపు వాహనాల కొనుగోలు. చెత్త తరలింపు, ట్రీట్మెంట్కు తగిన విధానాలు అమలు చేయాలని తీర్మానం. రాంకీ ఒప్పందం తదితర అంశాల పరిష్కారానికి నిర్ణయం. చెత్తను తక్కువ ల్యాండ్‌ఫిల్ చేసి, ఎక్కువ విద్యుత్ ఉత్పత్తికి నిర్ణయం.
- ప్లాస్టిక్ నిషేధానికి చర్యలు తీసుకోవాలని నిర్ణయం.
- రోడ్డు కోతలకు తావులేకుండా కేబుల్స్ వంటివి ఏర్పాటుకు డక్టింగ్ పనులు.
- రోడ్లపై నీటి నిల్వ సమస్యలు లేకుండా చూసేందుకు శాశ్వత చర్యలు. తాత్కాలికంగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు. దీనికోసంప్రత్యేక బృందాల నియామకం.
- కాంట్రాక్టుల విధానంలో మార్పులు అవసరమని అభిప్రాయ పడింది. ఒకరికే ఎక్కువ పనులు.. వేర్వేరు ప్రాంతాల్లో ఇవ్వకూడదు. కాంట్రాక్టర్ల స్థాయిని బట్టి చేయగల పనులు మాత్రమే ఇవ్వాలి. రూ.10 లక్షల లోపు పనులు రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్లు, బస్తీ కమిటీలకు అప్పగించాలి.
- నిధుల మంజూరులో జాప్యం నివారణ. ఇందులో భాగంగా కమిషనర్‌కు ఉన్న రూ.50 లక్షల మంజూరు అధికారాన్ని రూ.2 కోట్లకు... స్టాండింగ్ కమిటీ అధికారాన్ని రూ.2 కోట్ల నుంచి రూ.10 కోట్లకు పెంచాలి. పాలకవర్గం అధికారాన్ని రూ.5 కోట్ల నుంచి రూ.50 కోట్లకు పెంచాలి. వీటికి అనుగుణంగా జోనల్ కమిషనర్లకు కూడా పెంచాలి.
- పనులను రూ.2 కోట్లకు మించకుండా ప్యాకేజీలుగా విభజించాలి. తద్వారా నాణ్యతకు, మంచి కాంట్రాక్టర్లు రావడానికి అవకాశం ఉంటుందని కమిటీ అభిప్రాయం.
- టౌన్‌ప్లానింగ్, ఇంజినీరింగ్, పారిశుద్ధ్యం, వాటర్ బోర్డు తదితర విభాగాల్లోని ఖాళీలన్నింటినీ యుద్ధ ప్రాతిపదికన భర్తీ చేయాలి.
- ఎల్ఈడీ వీధి దీపాల ప్రాజెక్టు అమలుకు అంగీకారం.
- నగరంలో ప్రస్తుతం 5 శాతం మాత్రమే ఉన్న గ్రీనరీ పెంపునకు చర్యలు
- కొత్త చట్టం వల్ల రహదారుల వెడల్పు పనులకు నష్ట పరిహారంగా అధిక నిధులు చెల్లించాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో ఫ్లోర్‌స్పేస్ ఇండెక్స్ (ఎఫ్ఎస్ఐ), సెట్‌బ్యాక్ మినహాయింపుల వంటివి అమల్లోకి తేవాలని తీర్మానం.
- జీహెచ్ఎంసీకి సంబంధించిన 20, వాటర్ బోర్డుకు చెందిన 16 అంశాలపై ఏకాభిప్రాయం.
- ప్రస్తుతానికి ప్రాథమిక ముసాయిదాకు సిద్ధమైన సభ్యులు... దీర్ఘకాలంలో చేపట్టాల్సిన పనులతో సహా పూర్తి స్థాయి నివేదిక రూపొందించాలని నిర్ణయం.
- సమావేశంలో మంత్రులు నాయిని, పద్మారావు, ఎంపీ కేశవరావు, ఎమ్మెల్సీ జాఫ్రి, ఎమ్మెల్యేలు అక్బరుద్దీన్ ఒవైసీ, డాక్టర్ లక్ష్మణ్, చింతల రామచంద్రారెడ్డి పాల్గొన్నారు.
- ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం 11.30 గంటలకు మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో కమిటీ నివేదికపై సమీక్ష సమావేశం జరుగనుంది.