unmarried relations
-
24 వారాలకు అబార్షన్
న్యూఢిల్లీ: కొన్ని ప్రత్యేక కేటగిరీల వారికి మాత్రమే అవకాశం ఉన్న 20 వారాల అబార్షన్‌ను 24 వారాలకు పొడిగిస్తూ సుప్రీంకోర్టు చారిత్రక తీర్పు వెలువరించింది. 20 వారాల గర్భవిచ్చిత్తి అంటే శిశువును చంపేయడమేనంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు కొట్టివేసింది. అవివాహిత అనే కారణం చూపుతూ పిటిషనర్ వినతిని తోసిపుచ్చలేమని ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. లైంగిక హింస వంటి కేసుల్లో గర్భం దాల్చిన ఒంటరి మహిళలు 20 వారాల వరకు అబార్షన్ చేయించుకునేందుకు ప్రస్తుతం చట్టాలు వీలు కల్పిస్తున్నాయి. గర్భం దాల్చిన అనంతరం అందుకు కారకుడైన వ్యక్తితో సంబంధాల్లో మార్పు వచ్చినందున అబార్షన్‌కు అనుమతివ్వాలంటూ ఓ మహిళ ఢిల్లీ హైకోర్టు పిటిషన్ దాఖలు చేసింది. పెళ్లవకుండానే గర్భం దాల్చిన వారిని సమాజం చిన్నచూపు చూస్తుందని ఆమె పేర్కొంది. ఈ పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీశ్ చంద్ర శర్మ కొట్టివేశారు. అవివాహిత అయి, సమ్మతితోనే గర్భం దాల్చిందని, 20 వారాల పిండాన్ని తీసేయడమంటే శిశువును చంపేయడమేనని ఆయన అన్నారు. ‘‘ఒక మంచి ఆస్పత్రిలో చేరి, బిడ్డను కని వదిలేసి వెళ్లిపోవచ్చు. దత్తత తీసుకునేందుకు చాలా మంది ఎదురు చూస్తున్నారు. ఈ వ్యవహారాన్నంతా ప్రభుత్వం/ ఆస్పత్రి చూసుకుంటాయి. ఇందుకయ్యే ఖర్చును ప్రభుత్వం చెల్లించకుంటే నేనే భరిస్తా’అని పేర్కొన్నారు. ఈ తీర్పును సవాల్ చేస్తూ బాధిత మహిళ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పరిశీలించిన త్రిసభ్య ధర్మాసనం..హైకోర్టు తీర్పు మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్–1971కు విరుద్ధమని పేర్కొంది. -
కోర్టు బయట పరిష్కరించుకుంటాం: షమీ
న్యూఢిల్లీ: తన భార్యతో తలెత్తిన వివాదాన్ని కోర్టు వెలుపల పరిష్కరించుకునేందుకు తాను సిద్ధంగా ఉన్నానని భారత క్రికెటర్ మొహమ్మద్ షమీ తెలిపాడు. తన భర్త మోసగాడని, పలువురి మహిళలతో వివాహేతర సంబంధాలు పెట్టుకున్నాడని, తనను శారీరకంగా, మానసికంగా హింసిస్తున్నాడని షమీ భార్య హసీన్ జహాన్ కోల్‌కతా పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు గృహహింస, హత్యాయత్నం కింద షమీపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేశారు. ‘ఈ సమస్యపై చర్చించి పరిష్కరించుకోవడం మినహా చేసేదేమీ లేదు. కోర్టు వెలుపల పరిష్కారం కనుగొనడమే నాకు, నా పాపకు, నా కెరీర్‌కు ప్రయోజనకరం. కోల్‌కతాకు వెళ్లి నా భార్యతో మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నా’ అని మీడియాతో షమీ అన్నాడు. మరోవైపు అతని భార్య కూడా వివాద పరిష్కారానికే మొగ్గుచూపుతోంది. ‘నేను అతని అనుచిత స్క్రీన్ షాట్స్, వాట్సాప్ మెసేజ్‌లను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాకే షమీ నిజ స్వరూపమేంటో బయటపడింది. అయితే ఇప్పటికీ అతను నిజాయతీగా తన తప్పులను సరిదిద్దుకుంటానంటే మా అనుబంధాన్ని కొనసాగించేందుకు ఎలాంటి ఇబ్బంది లేదు. సయోధ్యపై ఆలోచిస్తాను’ అని హసీన్ తెలిపింది. ‘అతని ఫోన్ నాకు దొరకడం, అందులో అభ్యంతరకర ఫొటోలు, చాటింగ్‌లు ఉండటం వల్లే షమీ మిన్నకుండిపోయాడు. లేదంటే ఇప్పటికే విడాకులిస్తానని కోర్టుకెక్కేవాడు’ అని ఆమె చెప్పింది. మరోవైపు ఇప్పటికే బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టును కోల్పోయిన షమీకి ఐపీఎల్–11 సీజన్ కూడా చేజారే ప్రమాదముంది. అతను ప్రాతినిధ్యం వహిస్తున్న ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్టు షమీని ఆడించాలా వద్దా? అనే అంశంపై బోర్డు అనుమతి కోరింది. బీసీసీఐ నిర్ణయం కోసం వేచిచూస్తున్నట్లు ఢిల్లీ ఫ్రాంచైజీ సీఈఓ హేమంత్ దువా వెల్లడించారు. -
ప్రియుడితో కలిసి భర్తను చంపేసింది..
తాండూరు: వివాహేతర సంబంధం మానుకోవాలని హెచ్చరించినందుకు ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా తాండూరు మండలం కోనాపూర్ గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే రాజు(28) అనే యువకుడు గత కొంతకాలం నుంచి భార్యతో కలిసి కోనాపూర్ లో నివాసం ఉంటున్నాడు. కాగా రాజు భార్య మరొక వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయం రాజు దృష్టికి రాగా అతడు.. భార్యను ప్రవర్తన మార్చుకోవాలంటూ పదే పదే హెచ్చరించేవాడు. దీంతో తమ సంబంధానికి అడ్డుపడుతున్నాడని భావించిన భార్య, ప్రియుడితో కలిసి భర్తను అంతమొందించేందుకు పథకం పన్నింది. ప్రియుడితో కలిసి గతరాత్రి భర్తను హత్య చేసింది. అనంతరం ఆత్మహత్యగా చిత్రీకరించింది. ప్రియుడితో కలిసి భార్యనే రాజును చంపేసిందని గ్రామస్తులు, మృతుడు రాజు బంధువులు ఆరోపిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితులిద్దర్ని అదుపులోకి తీసుకున్నారు.