హేమలతా క్షమించు...
మెదక్: ఇరవై ఏళ్లుగా బ్యాంకులో పని చేస్తున్నా... ఉద్యోగం పర్మినెంట్ కాలేదు... చాలీచాలని జీతంతో కుటుంబ పోషణ భారమైంది. ఎవరైనా ప్రభుత్వ సంస్థలలో తాత్కాలిక ఉద్యోగిగా పని చేయొద్దని నా మనవి... హేమలతా నన్ను క్షమించు. తేజస్వి, వంశి, మా అమ్మ,నాన్నలను మంచిగా చూసుకో అని సూసైడ్ నోట్ రాసి గ్రామీణ వికాస్ బ్యాంక్‌లో పని చేసే తాత్కాలిక ఉద్యోగి విషం తాగి బలవన్మరణం చెందిన సంఘటన... మెదక్ జిల్లా వర్గల్ మండలం అనంతగిరిపల్లి శివారు రాఘవేంద్ర కాలనీలో చోటు చేసుకుంది.
మృతుని కుటుంబ సభ్యుల కథనం ప్రకారం...పెర్క ఉప్పలయ్య(40), హేమలత దంపతులు తమ కుమారులు వంశీ(10), తేజస్వీ(4) తోపాటు తల్లిదండ్రుల కలసి గజ్వేల్ మండలం ప్రజ్ఞాపూర్ గ్రామంలో నివాసముంటున్నాడు. దాదాపు ఇర వయ్యేళ్లుగా ఉప్పలయ్య తాత్కాలిక ప్రాతిపదికన ప్రజ్ఞాపూర్ గ్రామీణ వికాస్ బ్యాంకులో విధులు నిర్వహిస్తున్నాడు. ఏడాది కిత్రం జగదేవ్‌పూర్ గ్రామీణ వికాస్ బ్యాంకుకు బదిలీ అయ్యాడు. ఉద్యోగం పర్మినెంట్ అవుతుందనే ఆశతో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా భరిస్తూ నెట్టుకొస్తున్నాడు. వేతనం సరిపోక కుటుంబ పోషణ భారంగా మారింది.
ఉద్యోగం పర్మినెంట్ కాలేదని బాధ, ఆర్థిక ఇబ్బందులు అతన్ని తీవ్ర మనోవేదనకు గురి చేశాయి. మంగళవారం ఉదయం డ్యూటీ నిమిత్తం జగదేవ్‌పూర్‌లోని గ్రామీణ వికాస్ బ్యాంకుకని ఇంట్లో చెప్పి వెళ్లాడు. చీకటి పడినా ఇంటికి రాకపోవడంతో కుటుంబీకులు ఆరా తీసినా ఫలితం దక్కలేదు. బుధవారం ఉదయం వర్గల్ మండలం అనంతగిరిపల్లి శివారులో ఉప్పలయ్య మృతదేహాన్ని చూసి స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దాంతో పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని... అతడి జేబులో ఆత్మహత్యకు కారణాలు వివరిస్తూ రాసిన సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.