కాలుష్య నగరాల జాబితాలో గుర్గావ్
గుర్గావ్ : కాలుష్యపీడిత నగరంగా జాతీయ రాజధానికున్న గుర్తింపు విషయంలో గుర్గావ్ పోటీపడుతోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ఇటీవల విడుదల చేసిన అర్బన్ ఎయిర్ డాటాబేస్ద్వారా ఈ విషయం వెలుగుచూసింది. సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ (సీఎస్ఈ)) ఇటీవల అధ్యయనం చేసిన అనంతరం విడుదల చేసిన నివేదికలో ఢిల్లీతో పోలిస్తే గుర్గావ్ ఎంతమాత్రం మెరుగ్గాలేదని పేర్కొంది. కాలుష్యస్థాయిని గుర్తించేందుకు ఈ సంస్థ పోర్టబుల్ ఎయిర్ పొల్యూషన్ మానిటరింగ్ అనే పరికరాన్ని వినియోగించింది. రోజంతా ఆ పరికరాన్ని వినియోగించి చూడగా గాలిలో ధూళికణాల సంఖ్య 2.5గా నమోదైంది. ఈ స్థాయిలో ధూళికణాలు నమోదు కావడం ఆయా నగరాల్లో ఉంటున్నవారి ఆరోగ్యానికి ప్రమాదకరం.
ఈ ధూళికణాలు ఊపిరితిత్తులను దెబ్బతీస్తాయి. గుర్గావ్ నగరం వ్యాపార కేంద్రం కావడం, అనేక బహుళ జాతి సంస్థల కార్యాలయాలు ఇక్కడే ఉండడంతో వాహనాల వినియోగం గణనీయంగా పెరిగింది. దీంతో కాలుష్యం కూడా బాగా పెరిగిపోయింది. ఢిల్లీలో కాలుష్య నియంత్రణకు సంబంధించి ప్రభుత్వ నపలు విధానాలను అవలంబిస్తోంది. అయితే జాతీయ ప్రాదేశిక ప్రాంతం పరిధిలోని గుర్గావ్లో మాత్రం అటువంటివేమీ లేవు. ఈ విషయమై సంబంధిత అధికారి ఒకరు మాట్లాడుతూ ‘వాయుకాలుష్యానికి హద్దులు లేవు. జాతీయ ప్రాదేశిక ప్రాంతాలను కాలుష్య రహితం చేయడానికి సంబంధించి కొన్ని విధానాలు ఉంటే బాగుంటుంది. దేశంలోని అన్ని నగరాల్లో ప్రజారవాణా వ్యవస్థను తక్షణమే మెరుగుపరచాల్సిన అవసరం ఎంతయినా ఉంది’అని అన్నారు.