Russia-Ukraine war: ఉక్రెయిన్‌లో యూఎస్ నేతలు
వాషింగ్టన్: అమెరికా సెనేట్‌లో రిపబ్లికన్ నేత మిచ్ మెకొనెల్‌తో పాటు పలువురు రిపబ్లికన్ సెనేటర్లు ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లో ఆకస్మిక పర్యటన జరిపారు. అధ్యక్షుడు జెలెన్స్కీతో సమావేశమయ్యారు. ఉక్రెయిన్ గెలిచేవరకు మద్దతు కొనసాగిస్తామన్నారు. రిపబ్లికన్ నేతలతో సమావేశ వీడియోను జెలెన్స్కీ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఉక్రెయిన్‌కు 4000 కోట్ల డాలర్ల ప్యాకేజీకి వచ్చే వారం అమెరికా కాంగెస్ర్ ఆమోదం లభించే అవకాశముందని సమాచారం. మరోవైపు యూరోవిజన్ సంగీత కార్యక్రమాన్ని వచ్చే ఏడాది ఉక్రెయిన్‌లో జరుపుతామని జెలెన్స్కీ ప్రకటించారు. కుదిరితే మారియుపోల్‌లో నిర్వహిస్తామన్నారు.
డొనెట్స్క్పై పూర్తి ఫోకస్
ఉక్రెయిన్‌లోని పలు నగరాల నుంచి సేనలను ఉపసంహరించిన రష్యా తన దృష్టిని తూర్పున డొనెట్స్క్పై కేంద్రీకరించింది. దీంతో తమ దేశం దీర్ఘకాలిక యుద్ధ దశలోకి ప్రవేశిస్తోందని ఉక్రెయిన్ రక్షణ మంత్రి ఒలెక్సి రెజినికోవ్ ప్రకటించారు. తూర్పు ప్రాంతంలో పలు నగరాలపై రష్యా పట్టు కొనసాగుతోంది. అక్కడ తాము తాజాగా ఆరు నగరాలు/గ్రామాలను పునఃస్వాధీనం చేసుకున్నట్లు ఉక్రెయిన్ తెలిపింది. ఖర్కివ్ నగరాన్ని దాదాపు గెలిచామని జెలెన్స్కీ అన్నారు. సివర్స్కీ డోనెట్స్ నది వద్ద ఎవరికి విజయం లభిస్తుందనేది ఉక్రెయిన్ భవిష్యత్తును నిర్ధారితమవుతుందని మిలటరీ నిపుణులు అంటున్నారు. యుద్ధంలో రష్యా భారీగా నష్టపోతోందని బ్రిటన్ పేర్కొంది.
నాటోలో చేరుతాం: ఫిన్లాండ్
ఉక్రెయిన్‌పై దాడితో ఆందోళన చెందుతున్నామని, అందువల్ల నాటోలో చేరతామని ఫిన్లాండ్ పునరుద్ఘాటించింది. స్వీడన్ కూడా ఇదే బాటలో పయనించేలా కన్పిస్తున్న నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ ఫిన్లాండ్ ప్రెసిడెంట్ నినిస్టోతో ఫోన్లో మాట్లాడారు. నాటోలో చేరడం తప్పిదమవుతుందంటూ నచ్చజెప్పే యత్నం చేశారు. ఫిన్లాండ్–రష్యా సంబంధాలను ఇది దెబ్బతీస్తుందని ఘాటుగా హెచ్చరించారు.