పల్నాడులో వీరారాధన ఉత్సవాలు
పల్నాటి వీరారాధనోత్సవాల్లో గురువారం ప్రధానమైన ఘట్టమైన కోడిపోరు ఉత్కంఠగా సాగింది. కత్తి సేవలు, వీరుల ఆయుధాలకు గ్రామోత్సవాలు, ఆయుధాల ముందు వీరంగాలతో కారంపూడి పులకించిపోయింది. వీరాచారవంతులకు రక్తగాయాలతో అమరవీరులకు తర్పణమిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు తరలిరావడంతో పల్నాడు నుదుటిపై ఉత్సవాల సిందూరం దేదీప్యమానంగా మెరిసింది.
రణక్షేత్రం నిలువెల్లా వీరావేశం
కత్తుల సేవలతో చిందిన రక్తం
వీరంగమాడిన మహిళలు, పిల్లలు
కోడిపోరుకు భారీగా తరలివచ్చిన ఆచారవంతులు
కారంపూడి: వీరాచారవంతులు నాగులేరులో వీరుల ఆయుధాలకు అలంకారాలు చేసుకుని, వాటి ముందు చెన్నపట్నాలు(ముగ్గులు) వేసి వీరంగం ఆడారు. ఇది జరుగుతండగానే మహిళలు పొంగళ్లు సిద్ధం చేశారు. అనంతరం పూనకాలతో ఊగిపోయారు. ఆచారవంతులు కత్తిసేవలతో చెన్నకేశవస్వామిని దర్శించుకుని బ్రహ్మనాయుడు విగ్రహం, మల్లీ అంకాళమ్మగుడిలో ఆచారాలు నిర్వహించారు. అక్కడ పోతురాజులు మెడలో వీరతాడుతో వీరంగం ఆడారు. ఇలా గ్రామం మొత్తం వీరాచారవంతుల ఆచార వ్యవహారాలతో నిండిపోయింది. గ్రామోత్సవాల సమయంలో పలుచోట్ల వీరాచారవంతులు చేసుకున్న కత్తి సేవలతో పలువురి గుండెలపై రక్తం చిందింది. వెంటనే గాయాలపై తోటి ఆచారవంతులు పసుపు రాస్తూ వారి కత్తి సేవలను ఆపే ప్రయత్నం చేశారు. వీరులగుడి నాగులేరు పరిసరాల్లో పొంగళ్లు చేసుకుని అంకాళమ్మకు మొక్కులు చెల్లించారు. వేలాది మంది మహిళలు అంకాళమ్మకు బోనాలు చెల్లించారు. వేలాది కోడి పుంజులు, పొట్టేళ్లు అంకాళమ్మ, పోతురాజులకు అర్పించారు. వైఎస్సార్సీపీ సీఎల్పీ విప్ మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, పెదకూరపాడు నియోజకవర్గ సమన్వయకర్త కావటి మనోహరనాయుడు, పార్టీ మండల అధ్యక్షుడు పంగులూరి రామకృష్ణయ్య తదితరులు అన్ని ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
నేడు కళ్లిపాడు
శుక్రవారం కళ్లిపాడు ఉత్సవంతో పల్నాటి వీరారాధనోత్సవాలు ముగుస్తాయి. కళ్లిపాడు రోజు మందపోరులో మృతి చెందిన లంకన్న ఒరుగు కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. గురువారం రాత్రి నుంచి ఆచారవంతుడు లంకన్నలా (ప్రాణం లేని వ్యక్తిలా) వీరుల గుడి ఆవరణలో పడి ఉంటాడు. గ్రామోత్సవం అనంతరం వీరుల ఆయుధాలన్నీ పీఠాధిపతితో అక్కడకు చేరుకుంటాయి. బ్రహ్మనాయుడు వేషంలో ఉన్న పీఠాధిపతి వారికి ప్రాణ ప్రతిష్ట చేస్తారు.