యువతి కిడ్నాప్
పి.గన్నవరం :
మండలంలోని వాడ్రేవుపల్లి గ్రామంలో 17 ఏళ్ల యువతిని కిడ్నాప్ చేసిన ఘటనలో ఐదుగురిపై పి.గన్నవరం పోలీసులు శనివారం రాత్రి కేసు నమోదు చేశారు. ఎస్సై పి.వీరబాబు కథనం ప్రకారం.. ఈ నెల 23న వాడ్రేవుపల్లికి చెందిన ఎస్.సత్యనారాయణ కుమార్తెను కొందరు వ్యక్తులు కిడ్నాప్ చేశారు. పరిసర గ్రామాల్లో గాలించినప్పటికీ ఫలితం లేకపోవడంతో యువతి తండ్రి శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. మానేపల్లి గ్రామానికి చెందిన దుర్గాప్రసాద్ తన కుమార్తెకు మాయమాటలు చెప్పి కిడ్నాప్ చేశాడని, అతడికి మరో నలుగురు సహకరించారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీంతో నిందితుడు దుర్గాప్రసాద్‌తో పాటు, మరో నలుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై వీరబాబు వివరించారు.